వాళ్ళిద్దరిది "భూం" మాయ... ఇచ్చినంత ఇద్దాం, లేదంటే ఐ.పి. పెడదాం... ఆ వెంచరులో అంతా మాయాజాలం... బాధితుల సొమ్ము ఎగవేసెందుకు సిద్ధం... చక్రం తిప్పుతున్న ఫైనాన్షియర్స్...  చేతులు ఎత్తివేసే ప్రయత్నంలో డెవలపర్స్...

Submitted by SANJEEVAIAH on Thu, 07/03/2024 - 10:58
Photo

వాళ్ళిద్దరిది "భూం" మాయ...

ఇచ్చినంత ఇద్దాం... లేదంటే ఐ.పి. పెడదాం...

ఆ వెంచరులో అంతా మాయాజాలం

బాధితుల సొమ్ము ఎగవేసెందుకు సిద్ధం

చక్రం తిప్పుతున్న ఫైనాన్షియర్స్ 

చేతులు ఎత్తివేసే ప్రయత్నంలో డెవలపర్స్


(నిజామాబాద్ - ప్రజాజ్యోతి ప్రతినిధి - ఎడ్ల సంజీవ్)


నిజామాబాద్ నగర శివారులోని మాధవ నగర్ బైపాస్ రోడ్డులో వెలసిన ఓ వెంచర్ లో జరిగిన అక్రమాలు తవ్విన కొద్ది బయట పడుతున్నాయి. పట్టేదారుల నుంచి 16 ఎకరాల 20 గుంటల భూమిని కొనుగోలు చేసిన జే జే డెవలపర్స్ ప్లాట్లుగా మార్చి అమాయకులైన 68 మంది నుంచి సుమారు రూ.10.50 కోట్లకు పైగా నిధులు సేకరించారు.ఈ మేరకు వారికి అగ్రిమెంట్లు చేసి ఇచ్చారు. కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇక్కడే అసలు తిరకాసు పెట్టీ, కొందరు ఫైనాన్షియర్స్ నుంచి సుమారు 14 కోట్లు ఫైనాన్స్ తీసుకొని ఆ భూమిని నేరుగా పట్టేదారుల నుంచి వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం.  పట్టేదారులకు  చెల్లించాల్సిన  నిధులు సమకూరకపోవడంతో డెవలపర్స్, ఫైనాన్సియర్స్ ను ఆశ్రయించక తప్ప లేదు.ఈ భూమిని తాము ప్లాట్లుగా మార్చి కొనుగోలుదారుల నుంచి 10.50 కోట్ల రూ.లు తీసుకొని అగ్రిమెంట్లు చేసి ఇచ్చామని ముందుగానే జే జే డెవలపర్స్, ఫైనాన్షియర్లకు తెలియజేశారు. రూ.14 కోట్లు తిరిగి చెల్లించాక తమ భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ భూమి విలువ భారీగా పెరిగి రూ .60 కోట్లకు చేరడంతో ఫైనాన్షియర్లు  మాట మార్చారు. ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో జే జే డెవలపర్స్ పై ఒత్తిడి పెంచి ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఎగనామం పెట్టేందుకు పన్నాగం పన్నారు.

*ఐ.పి. పెట్టేసి చేతులెత్తేస్తే పోలా...*

ఈ తతంగానికి సూత్రధారులుగా వ్యవహరిస్తున్న ఫైనాన్షియర్లు కొత్త నాటకానికి  తెర లేపారు. సందట్లో సడే మియాగా ఈ భూ వివాదంలోకి చొరబడిన మరో కేబుల్, రియల్ వ్యాపారి సరికొత్త నాటకాన్ని రచించారు. ఆయన డైరెక్షన్లో, ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కుచ్చు టోపీ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.జే జే డెవలపర్స్ కు ఐ.పి. కోసం కోర్టును ఆశ్రయించాలని ఉచిత సలహా ఇచ్చినట్లు తెలిసింది. పోలీసు కేసుతో పాటు కోర్టు కేసులకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని, ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐ.పి.) వేయాలని సూచించినట్లు సమాచారం. ఈ విషయంలో డెవలపర్స్ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
కొందరు వ్యతిరేకించగా, మరికొందరు ఆ 10 కోట్ల డబ్బులు తిరిగి చెల్లించలేమని, మొత్తం కేసులను ఫైనాన్సియర్స్ చూసుకుంటారనే ఆలోచనలు చేస్తున్నారు.తాము మార్కెట్లో బదనాం కాకుండా డెవలపర్స్ ను బదనాం చేసి గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ బడా రియల్ వ్యాపారులు. అయితే ఐ.పి పెట్టే విషయం ఎలా ఉన్నా బాధితులకు ఎగనామం పెట్టే ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేశారు. ఒకవైపు బాధితులను బెదిరించి సెటిల్ చేయాలని లేదా రాజకీయంగా అధికారులపై ఒత్తిడి పెంచి దర్యాప్తును నిలిపి వేయాలని చక్రం తిప్పుతున్నారు. మరోపక్క ఇంటలిజెన్సు దర్యాప్తు అధికారులపై ఒత్తిడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే బాధితులు డెవలపర్సుకు డబ్బులు చెల్లించి అగ్రిమెంట్లు మాత్రమే చేసుకున్నారు. కానీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో డెవలపర్సు, ఫైనాన్సియర్స్ కలిసి మొత్తం భూమిని ఎగవేసెందుకు కుట్రలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

*బాధితుల్లో ప్రముఖులు*

ఈ వెంచర్ లో సుమారు 68 మంది ప్లాట్లు కొనుగోలు చేయగా, ఇందులో అనేకమంది ప్రముఖులు ఉన్నారు. ముగ్గురు ప్రముఖ న్యాయవాదులు ఉండగా, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.వీరితో పాటు బాల్కొండ ప్రాంతంలో పనిచేస్తున్న ఓ హెడ్ మాస్టర్ ఈ వెంచర్లో ప్లాటు కొనుగోలు చేయగా, ఆయన ద్వారా మరో 13 మంది ప్రభుత్వ  టీచర్లు కొనుగోలు చేశారు. అంతేగాక కొందరు అమాయకులైన జనం డెవలపర్స్ ను నమ్మి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను అమ్ముకోగా, మరికొందరు బంగారు నగలను తాకట్టు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేశారు. వీరిలో ప్రభుత్వ టీచర్లు హెచ్డిఎఫ్సి తోపాటు ఇతర బ్యాంకుల్లో ఈ ప్లాట్ ల కోసం రుణాలు తీసుకొని నేటికీ వాయిదాలు చెల్లిస్తున్నారు. అయితే పట్టేదారుల నుంచి ఈ భూమిని కొనుగోలు చేసిన డెవలపర్స్ వారి వద్ద నుంచి అగ్రిమెంట్ చేసుకొన్నారు. ఆ తర్వాత ఫ్లాట్లుగా మార్చి మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. ఇలా 68 మంది ప్లాట్లు కొనుగోలు చేయగా, వారి వద్ద నుంచి పది కోట్ల రూపాయలు సేకరించి వారికి డెవలపర్స్ అగ్రిమెంట్లు చేసి ఇచ్చారు.

క్రాస్ రిజిస్ట్రేషన్...

 డెవలపర్స్ మధ్యవర్తిత్వంతో నేరుగా పట్టేదారుల నుంచి ఫైనాన్స్ ఇచ్చిన బడా వ్యాపారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకున్న ఫైనాన్షియర్లు, తమకు డెవలపర్స్ తో ఎలాంటి సంబంధం లేదని, నేరుగా పట్టేదారుల నుంచి భూమిని కొనుగోలు చేశామనే ప్రచారాన్ని భుజానికి ఎత్తుకున్నారు.కానీ  డెవలపర్స్ నుంచి 68 మంది ప్లాట్లు కొనుగోలు చేసిన విషయం ముందే తెలిసినప్పటికీ, న్యాయస్థానంలో అగ్రిమెంట్లు చెల్లవనే నమ్మకంతో ఫైనాన్సియర్స్  కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏది ఏమైనా డెవలపర్స్ ను నమ్మి ప్లాట్లు కొనుగోలు చేసిన అమాయకులను నమ్మించి నయవంచనకు గురి చేసేందుకు ఇరువర్గాలు  యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఫైనాన్షియర్ రంజిత్ రెడ్డిని "ప్రజాజ్యోతి"  వివరణ కోరగా బాధితుల వ్యవహారం తమకు తెలియదని, భూమి యాజమానుల నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నానని తెలిపారు. నిబంధనల మేరకే అనుమతులు తీసుకున్నానని అన్నారు. కొందరు పని కట్టుకొని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.