ఆ'రోగ్యం' మన హక్కు..!!

Submitted by Praneeth Kumar on Tue, 09/01/2024 - 08:05
'Health' is our right..!!

ఆ'రోగ్యం' మన హక్కు..!!

ఖమ్మం, జనవరి 09, ప్రజాజ్యోతి.

75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత్‌లో రాజ్యాంగ లక్ష్యమైన అందరికి విద్య, ఆరోగ్యం ఒక నినాదంగానే మిగిలింది. వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతి ఫలాలు పేద వర్గాలకు చేరువకాకపోవడంవల్ల ఆధునిక వైద్యసేవలు అందని ద్రాక్షలయ్యాయి. ఉచిత వైద్య ఆరోగ్య సేవలు పేదవర్గాలకు ఆశించిన మేరకు అందుబాటులో లేవు. అందరికి ఆరోగ్యం దిశగా అడుగులు వేయడానికి మన ప్రభుత్వాలు ప్రాథమిక ఆరోగ్యం పై దృష్టి సారించాలి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అంటే ప్రజలందరికి (కుల, మత, ప్రాంత, వర్గభేదాలు లేకుండా) సమానమైన, నాణ్యమైన కనీస ఆరోగ్య సేవలు ఇంటికి దగ్గరగా, అతి తక్కువ ధరలో అందుబాటులోకి రావాలి. ప్రాథమికంగా అందించే వైద్యసేవలు సాంస్కృతికంగా ప్రజలకు ఆమోదయోగ్యమై ఉండాలి. ప్రజలు అనారోగ్యానికి కారణం అవుతున్న వివిధ రంగాలను సమన్వయపరిచే ఒకే వేదిక పైకి తీసుకు రావాలని ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలంనింటికి ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యం చేరుకోవడానికి ప్రపంచ దేశాల ప్రభుత్వాల సమన్వయంతో త్వరలో ప్రపంచ ఆరోగ్యదినోత్సవాన్ని సభ్యదేశాలలో నిర్వహించబోతోంది.
'ఆరోగ్యం అంటే ఏ రోగం లేకుండా ఉండటం మాత్రమే కాదు ఆరోగ్యం అంటే ఒక సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన శారీరక, మానసికస్థితి. సామాజికంగా, సాంస్కృతికంగా ఉత్తమ మనుషులుగా ఉండి సాటివారి ప్రాణాలకు ఉపయోగపడటం'. శారీరక వ్యాయామం, యోగ జీవనశైలిలో భాగం కావాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించకపోవడం వల్ల రోగాలు మన జీవితాలను శాసిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లో ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ప్రపంచ ప్రజలను వ్యాధుల బారి నుండి సురక్షితంగా ఉంచడానికి, బలహీనవర్గాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి, ప్రపంచంలో ఎవరు, ఏ మూలఉన్న వారికి అత్యున్నత ఆరోగ్యం అందించాలని ఐక్యరాజ్యసమితి పని చేస్తుంది. కరోనా వంటి అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో అన్ని దేశాలకు దిశానిర్దేశం చేసి ఆరోగ్య సేవలను సమన్వయ పరిచింది. ప్రస్తుతం ప్రపంచంలోని 194 దేశాలలో ఈ సంస్థ పని చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 75వ వార్షికోత్సవం జరుపుకొంటున్నది. డబ్లుటిఒ 'అందరికీ ఆరోగ్యం' అనే నినాదాన్ని ఎంచుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం పై అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నది.
భారత దేశంలో ప్రజారోగ్యం దక్షిణ రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రాల్లో ఆరోగ్య సూచీలు ఉత్తరాది రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడ ప్రజల్లో చైతన్యం, విద్యావిధానం అందుబాటులో ఉన్న వనరులు కారణమని చెప్పవచ్చు. ప్రభుత్వం విడుదల చేసిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌వి లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 69% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరోగ్యానికి ముఖ్యమైన మంచి నీటి సరఫరా సదుపాయం కేవలం 22% మందికి మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా సురక్షితం కాని పోయిమీద (కట్టెలు, బొగ్గు, పిడకలు) ఉపయోగించి వంట చేసుకునే ఇండ్లు 16% వున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 22% ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేస్తున్నారు. మహిళల ఆరోగ్య విషయంలో 30% మంది మహిళలకు 18 సం నిండకుండానే పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఈ వయసులో ప్రత్యుత్పత్తి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకుండా గర్భం దాల్చుతున్నారు. దీని వలన నవజాత శిశువుల మరణాల సంఖ్య పెరుగుతున్నది. మహిళల్లో 15% మంది పోషకాహార లోపంతో, 36% మంది అధిక బరువుతో బాధపడుతున్నారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
రెండు సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లలకు 25% టీకాలు అందడం లేదు. ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 30% మంది పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. పురుషుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరికి, మహిళల్లో ప్రతి పదిమందిలో ఒకరికి అధిక రక్తపోటు, ప్రతి పదిమందిలో ఒకరికి మధుమేహం ఉన్నాయి. ప్రతి ఐదుగురు పురుషుల్లో పొగతాగడం, పొగాకు తినే అలవాటు ఉంది, ప్రతి ముగ్గురిలో ఒకరికి మందు తాగే అలవాటు ఉందని సర్వేలు చెబుతున్నాయి. పెట్టుబడిదారీ విధానంలో ప్రజారోగ్యం కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే మార్కెట్ సరుకుగా మారింది. కరోనా కాలంలో జనాల ప్రాణాలను కాపాడడానికి ఆక్సిజన్ కోసం పడ్డ ఇబ్బందులు చూసి రాజస్థాన్ ప్రభుత్వం తెచ్చిన ఆరోగ్య హక్కు హర్షణీయం. మనిషికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి. చుట్టూ ఉండే గాలి, నీరు, కాలుష్యం ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు ఉన్నంత కాలం.. ప్రజలను ఉద్యోగం పేరుతో, పోటీ పేరుతో ఆందోళనకు గురి చేసే కార్పొరేట్ సంస్థలు ఉన్నంత కాలం.. అసలు కనీస ఆహారం, నివాసం, పని, ఆరోగ్య సేవలు కల్పించ లేని ప్రభుత్వాలు ఉన్నంత కాలం.. సంపూర శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం సాధ్యపడదు.
అందుకే ఆరోగ్యమనేది నినాదంగా ఉండిపోకుండా అది నిజం కావాలంటే ప్రభుత్వం సామ్యవాద సమాజం వైపు అడుగులు వేయాలి. ప్రతి ఒక్కరూ ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఆరోగ్య సేవలు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందే అవకాశం ఉండాలి. ప్రపంచంలో 30% ప్రజలకు అత్యవసర సేవలు అందుబాటులో లేవు. ప్రతి సంవత్సరం ఆరోగ్యం పై చేసే ఖర్చులతో 20 లక్షల మంది దారిద్య్ర రేఖ దిగువకు జారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటి సారిగా ఆరోగ్య హక్కు చట్టం తేవడం హర్షణీయం. మనిషికి ఈ చట్టం కింద వ్యక్తి వుండే రకరకాల ఆరోగ్య హక్కులను పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ ఆసుపత్రి వర్గాల నుండి తెలుసుకునే హక్కు, అత్యవసర సేవలు పొందడానికి అందుబాటులో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో ముందస్తు డబ్బులు చెల్లించకుండానే వినియోగించుకునే హక్కు, అధిక ప్రమాణాలతో చికిత్స, ఉచిత రవాణా హక్కు, పేషెంట్ మరణించినప్పుడు ఆస్పత్రి ఖర్చులు చెల్లించారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకు వెళ్లే హక్కు మొదలైనవి ఇందులో కల్పించారు. ఈ హక్కులకు సంబంధించిన మొత్తం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాహకులు ఈ చట్టం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం అమలు అయితే అందరికీ ఆరోగ్యం అనేది నినాదం కాకుండా ఒక విధానంగా కొనసాగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రజారోగ్యం మీద బడ్జెట్ ఎక్కువ కేటాయించి మానవ వనరుల సంరక్షణకు సమగ్రమైన ప్రజారోగ్య అభివృద్ధి వ్యూహాలను రూపొందించి అమలు చేయాలి. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నాణ్యమైన మందుల తయారీకి బాధ్యత వహించాలి. నకిలీ మందుల తయారీని అడ్డుకోవాలి. మందుల విక్రయాల మీద ప్రభుత్వ అధికారుల నిఘా వుండాలి. జనరిక్ పేరుతో మాత్రమే మందులు విక్రయించే విధానం అమలు చెయ్యాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి. గ్రామ పంచాయితీలలో వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ మహిళా సంఘాలు, ఆరోగ్యకార్యకర్తలు ప్రతి వారం ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య సూత్రాల పట్ల అవగాహన కల్పించాలి. ప్రభుత్వం ఉచితవైద్యం, ఉచిత విద్యను ప్రాధాన్య రంగంగా ఎంపిక చేసుకొని అభివృద్ధి పరచాలి అన్నది మా వాదన.