ట్రాఫిక్‌ జరిమానాల పై రాయితీల రాజీ సరికాదు..!!

Submitted by Praneeth Kumar on Thu, 04/01/2024 - 09:48
Compromise of concessions on traffic fines is not correct..!!

ట్రాఫిక్‌ జరిమానాల పై రాయితీల రాజీ సరికాదు..!!
   
ఖమ్మం, జనవరి 04, ప్రజాజ్యోతి.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలను మినహాయించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పౌరుల పట్ల దయతో తీసుకున్నదిగా కనిపించవచ్చు. కానీ ఇది చట్టం, ప్రజా భద్రతల ప్రాథమిక మూలాలను బలహీనపరుస్తుంది. దేశంలోని అనేక ఇతర ప్రాంతాలలో వలె తెలంగాణలో విధించే ట్రాఫిక్ జరిమానాలను కేవలం శిక్షగా మాత్రమే చూడకూడదు. రహదారి క్రమశిక్షణను, రహదారి వినియోగదారులందరి భద్రతను నిర్ధారించడానికి అవసరమైన సాధనాలుగా కూడా చూడాలి. ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండే ఈ జరిమానాలు ఆ నిబంధనల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, ఆ నిబంధనల ఉల్లంఘనకు ప్రతిబంధకాలుగా పనిచేస్తాయి. బహుశా ప్రజాకర్షక చర్యగానో, లేక పౌరులకు ఆర్థిక ఉపశమనం కలిగించేందుకో ఈ జరిమానాలను మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది. కానీ ఈ నిర్ణయం రహదారి భద్రతను నిర్వహించడంలో ప్రభుత్వ అంకితభావంపైనా, చట్టపరమైన జవాబుదారీతనం పట్ల ప్రభుత్వ నిబద్ధతపైనా సందేహాన్ని కలిగించేదిగా ఉంది.
ముఖ్యంగా ఈ నిర్ణయం వల్ల అత్యంత తక్షణ దుష్ఫలితం రహదారి భద్రత విషయంలోనే నెలకొంటుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా విధించే జరిమానాలు రహదారి భద్రతను పెంచుతాయి. ఈ జరిమానాని తీసివేయడం/ పాక్షికంగా తగ్గించటం వలన వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే ధైర్యం చేయవచ్చు. ఇది నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దారి తీస్తుంది. తెలంగాణ రోడ్లు ఇప్పటికే అధిక ట్రాఫిక్ సమస్యతో బాధపడుతున్నాయి. ఇప్పుడు నిర్లక్ష్య డ్రైవింగ్ కూడా దానికి తోడైతే ప్రమాదాల శాతం గణనీయంగా పెరుగుతుంది, రహదారి మరణాలు పెరుగుతాయి.
జరిమానాలను మాఫీ చేయడం ప్రమాదకరమైన, చట్టపరమైన పూర్వస్థితిని సెట్ చేస్తుంది. ఇది ట్రాఫిక్ చట్టాలను పాటించడం అత్యవసరం కాదన్న భావం కలిగిస్తుంది, తద్వారా చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీల అధికారం పట్ల గౌరవాన్ని తగ్గిస్తుంది. ఇది ఇక్కడకే పరిమితంగాక, ఇతర నిబంధనలకూ విస్తరించి, చట్టాల అమలును ప్రభావితం చేసే అవకాశం ఉంది.
అలాగే ట్రాఫిక్ జరిమానాలు రాష్ట్రానికి గణనీయమైన ఆదాయ వనరుగా ఉంటూవచ్చాయి. రహదారి నిర్వహణ, ట్రాఫిక్ వ్యవస్థల నిర్వహణ వంటి క్లిష్టమైన ప్రజా సేవలకు ట్రాఫిక్ జరిమానాలు నిధులను సమకూరుస్తున్నాయి. ఈ ఆదాయ ప్రవాహాన్ని తొలగించడం లేదా వదులుకోవడం వల్ల రాష్ట్ర బడ్జెట్‌‌ పై భారం పడుతుంది. ఈ కీలక రంగాలలో వనరులు తగ్గుతాయి. వనరులలో ఈ తగ్గింపు రహదారి నాణ్యతను, భద్రతను ప్రభావితం చేయడమే కాకుండా ఈ ప్రాంతం తాలూకు మొత్తం ఆర్థిక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుంది.
అలాగే ట్రాఫిక్ జరిమానాలు మాఫీ చేయబడతాయని తెలిసి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడానికి ఉత్సాహం చూపవచ్చు. జరిమానాల ప్రభావం లేకుండా డ్రైవర్లు అతివేగం, ట్రాఫిక్ సిగ్నళ్లను విస్మరించడం, ఇతర రకాల ప్రమాదకర డ్రైవింగ్‌ ధోరణులకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా రహదారి పై క్రమశిక్షణ క్షీణిస్తుంది. అంతేకాకుండా, ఇది నైతిక పాలన పట్ల, చట్టాల సమాన అమలు పట్ల ప్రభుత్వ నిబద్ధత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. అటువంటి అవగాహన ప్రభుత్వం పై ప్రజల విశ్వాసాన్ని తగ్గిస్తుంది. దీర్ఘకాలంలో జరిమానాలను మాఫీ చేయడం సమాజంలోని చట్టపరమైన, నైతికమైన ప్రమాణాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక రకమైన విష సంస్కృతిని సృష్టించే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం, న్యాయ వ్యవస్థల పై ప్రజల విశ్వాసం బాగా పనిచేసే ప్రజాస్వామ్యానికి అవసరం. ట్రాఫిక్ జరిమానాల పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల భద్రత కంటే, చట్టపరమైన సమగ్రత కంటే ప్రజాకర్షక చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందనటానికి సంకేతంలా ఉంది. పౌరుల దీర్ఘకాలిక ప్రయోజనం కోసం, భద్రత కోసం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించడం చాలా అవసరం అన్నది మా అభిప్రాయం.