కులం కదిలింది - వర్ణం నిలిచింది.

Submitted by Praneeth Kumar on Tue, 13/02/2024 - 09:53
Caste moved - Color stood.

కులం కదిలింది - వర్ణం నిలిచింది.
- ఇదేనా మన చరిత్ర..!!
                  
ఖమ్మం, ఫిబ్రవరి 13, ప్రజాజ్యోతి.

పేరులో కులాన్ని సూచించటం మనకు కొత్తకాదు. రెడ్డి, నాయుడు, శాస్త్రి, శర్మ, త్రివేది, ద్వివేది, నాడార్‌, రాజ్‌పుత్‌, మోదీ, జోషి ఇలా ఎన్నో కుల సూచికలు మన పేర్ల వెనుక కనపడతాయి. ఇలాంటి సూచికలను పెట్టుకోవటం నామోషీగా భావించే వారి సంఖ్య చాలా తక్కువ. పిలుపులో సౌలభ్యం కోసం వ్యక్తుల పేర్లు పొట్టివి అవుతున్నాయి. అంతమేరకు కుల సూచికలు తొలగిపోతున్నాయి. ఆధునిక భావాల ప్రభావంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు కుల ప్రస్తావనలు లేని పేర్లను పెడుతున్నారు. సౌలభ్యం సంగతి ఎలా ఉన్నా కుల సూచికలతో ఇబ్బంది పడని వారి సంఖ్యే మనకు ఎక్కువ. ఎందుకంటే ఆ సూచికలు ఒక స్థాయిని, హోదాని వెల్లడిస్తాయి. అగ్రకులాల విషయంలో ఇది స్పష్టంగా కనపడుతుంది. దళితులకు ఈ వెసులుబాటు చాలా చోట్ల లేదు. ముఖ్యంగా తెలుగునాట ఇది కొట్టొచ్చినట్లు కనపడుతుంది. మాల, మాదిగ, ఎరుక, దొమ్మరి అనే పేర్లు వింటేనే తిరస్కారాన్ని, ఏహ్యతను, చిన్నచూపుని ప్రదర్శించే సంస్కృతి నిన్నమొన్నటి వరకు అందరిలో పాతుకుపోయింది. దీన్ని నిరసిస్తూ ఒక ధిక్కార స్వరంతో తమ పేర్ల వెనుక మాల, మాదిగ అని పెట్టుకోవటం మామూలు విషయం కాదు. కులాల పేర్లను నిర్భీతిగా అసలు పేర్ల వెనుక తగిలించుకుని సముచిత గౌరవం, హక్కుల కోసం ప్రయత్నించటం 1990ల తర్వాత బాగా పెరిగింది. సామాజిక మార్పును విభిన్న రీతిలో కోరుకోవటంగా దీన్ని పరిగణించొచ్చు. అంబేడ్కర్‌ రాజకీయాల ప్రభావంతో మొదలైన ఈ ధోరణి సామాజిక న్యాయ అందోళనల్లో కొత్త ఒరవడిని సృష్టించింది.
మన చరిత్రలో దీనికి పూర్తిగా భిన్నమైన పరిణామం ఇంకోటి ఉంది, అది సుదీర్ఘకాలం జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది. సంప్రదాయ కులాల పేర్లలోనే తమను చిన్నచూపు చూసే పరిస్థితి ఉందని భావించిన వారు ఆ పేర్ల మార్పు కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వాలకు వినతి పత్రాలు, మహజర్లు సమర్పించారు. బ్రిటిషు పాలనలో అది విస్తృతంగా జరిగింది. ఆనాటి జనాభా లెక్కల సమయంలో అదొక ఉద్యమంలా సాగింది. గ్రామాల్లో వాడుకలో ఉన్న కులాల పేర్ల స్థానంలో సంస్కృత పదాలతో కూడిన కొత్త పేర్లు వచ్చాయి. గొల్ల, మంగలి, చాకలి లాంటి పేర్ల స్థానాన్ని యాదవ, నాయిబ్రాహ్మణ, రజక లాంటి పేర్లు ఆక్రమించాయి. ఇలా పేర్ల మార్పుతో మొదలై అగ్రకులాల అలవాట్లు, పద్ధతుల వైపు పరుగులెత్తటం, అందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన సంఘటనలు మన చరిత్రలో చాలా కనిపిస్తాయి. అదొక సుదీర్ఘ ప్రయాణం. దేశంలో ఏదో ఒకచోట నిరంతరం సాగుతూనే ఉండేది. దీన్ని ఎలా చూడాలి..?? దాని ప్రాధాన్యతను ఎలా అర్థంచేసుకోవాలి..?? దాన్ని వివరించటానికి ఉపకరించే భావనను ఏమని పిలుచుకోవచ్చు..?? ఈ ప్రశ్నలను ఎంతో కొంత సమగ్రంగా అర్థంచేసుకోటానికి తోడ్పడిన పరిశోధనలు రావాలి. సామాజికంగా కింది స్థాయిలో ఉన్న కులాల పైకి ఎదగటానికి చేసే ప్రయత్నాలకు సాంస్కృటైజేషన్‌ (సంస్కృతీకరణ) అని పేరు పెట్టడం. దీన్ని అర్థం చేసుకోటానికి చాతుర్వర్ణ సిద్ధాంతం చాలా అడ్డంకిగా ఉందని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అసలు ధర్మశాస్త్రాల్లో వర్ణించిన విధంగా మన సమాజం ఎప్పుడూ లేదు. ఆ గ్రంథాలన్నీ అప్పటికే ఉన్నత స్థానంలో ఉన్నవారు సమాజంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నిర్దేశిస్తూ రాసినవిగానే చరిత్రకారులు భావిస్తారు. మన ప్రాచీన గ్రంథాల్లో వాస్తవాల వర్ణన శాతం చాలా తక్కువ. వాటిని ఆధారం చేసుకుని వివిధ ప్రాంతాలను పాలించిన రాజవంశాల పేర్లనే ఇప్పటికి కచ్చితంగా నిర్దారించలేం. సామాజిక జీవన చిత్రాన్ని వాటి నుంచి రాబట్టం చాలా కష్టం.
వర్ణాలను స్థూల శ్రమ విభజనకు నిదర్శనంగా మాత్రమే పరిగణించాలని చెప్పే వారూ ఉన్నారు. అలాగే వ్యక్తి గుణకర్మలను బట్టే వర్ణాల కేటాయింపు జరిగిందని వాదించే వారి సంఖ్యా తక్కువ కాదు. గుణకర్మలను బట్టి ఒక వర్ణం వారు ఇంకో వర్ణంలోకి మారే వెసులుబాటు ఉందని బోధించే వారూ మనకు కనపడతారు. సంప్రదాయ వాదులు చేసే ఈ సమర్థనల జోలికి పోకుండా మన సమాజాన్ని అర్థం చేసుకోటానికి చాతుర్వర్ణ సిద్ధాంతం ఎలా అడ్డంకిగా మారిందో కావాలి. మనది సుదీర్ఘ చరిత్ర ఉన్న కుల సమాజం. కులాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాలక్రమంలో కొత్త కులాలూ వచ్చాయి. కులాల స్థాయి, హోదాల గురించి పెనుగులాటలూ జరిగాయి. చాతుర్వర్ణ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇవేమీ కనపడవు. వర్ణ సిద్ధాంతం ప్రకారం నాలుగే కులాలు/వర్ణాలు ఉంటాయి. వీటి హోదాలు శాశ్వతం. దళితులకు ఈ సిద్ధాంత చట్రంలో స్థానం లేదు. సమాజంలోని వందలాది కులాలను పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా అసంబద్ధంగా తోస్తుంది. వర్ణ సిద్ధాంతంలో మార్పునకు అవకాశం లేదు. కులాల పరిస్థితి దీనికి భిన్నం. కుల సమాజంలో ఎన్నో మార్పులు జరిగాయి. హోదాల పెంపుదల కోసం ప్రయత్నాలు నిరంతరం సాగుతూనే ఉండేవి. ఆ ప్రయత్నంలో కులాల మధ్య వివాదాలు ముదిరితే విషయం రాజు దగ్గరికి వెళ్లేది. ఏ కులం పెద్దది, ఏ కులం చిన్నది అన్న దాంట్లో తుది తీర్పు రాజుదే. హిందూ రాజులే కాకుండా ముస్లిం రాజులు కూడా ఈ తీర్పులు ఇచ్చేవారు.
కుల వ్యవస్థకు రెండు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఒకటి బహుళ సంస్కృతులను అంగీకరించటం. అంటే ప్రతి కులానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు, సంప్రదాయాలు ఉంటాయని ఆమోదించటం అన్న మాట. రెండు పై స్థాయిలో ఉన్న కులాలను కింది స్థాయి వారు అనుకరించటం రెండో లక్షణం. ఈ అనుకరణ అనేది అన్నిచోట్లా సాఫీగా జరిగిందని భావించలేం. కొన్నిచోట్ల అది హింసకు, ప్రతిఘటనకు దారితీసింది. మరికొన్ని చోట్ల అంచెలంచెలుగా మాత్రమే ఆమోదం లభించింది. తమిళనాడు రామనాద్‌ జిల్లాలోని కల్లాల కులస్థులు ఆది ద్రవిడుల విషయంలో విధించిన నిషేధాలను చూస్తే ప్రతిఘటన ఎంత తీవ్రంగా ఉండేదో తెలుస్తుంది. ఆది ద్రవిడులు బంగారం, వెండి ఆభరణాలను ధరించకూడదు. మగవాళ్లు నడుముకు పై భాగాన వస్త్రాలు వేసుకోకూడదు. బనియన్లు, చొక్కాలు కూడా ధరించకూడదు. జుట్టు కత్తిరించుకోకూడదు. మట్టి పాత్రలు మినహా వేటిని వాడకూడదు. మహిళలు జాకెట్లు ధరించకూడదు. పూలు పెట్టుకోకూడదు. కుంకుమపువ్వును వాడకూడదు. పురుషులు గొడుగులను వాడకూడదు. చెప్పులను వేసుకోకూడదు. దేవతారాధన, స్త్రీపురుష సంబంధాల్లో బ్రాహ్మణ పద్ధతులను అనుసరించటం చాలా చోట్ల జరిగినా అదే ఏకైక సంస్కృతీకరణ మార్గమని చెప్పలేం. కొన్ని కులాలకు ఒకప్పుడు అమ్మ దేవతలు తప్ప పురుష దేవతలే లేరు. శివాలయాలు, రామాలయాల సంగతే తెలియదు. బ్రాహ్మణులు కొలిచే దేవుళ్లకు స్థానంలేదు. ఆ వర్గ పూజారులకూ చోటు లేదు. సంస్కృతీకరణలో భాగంగా ఈ దేవుళ్లూ, పూజారులు వచ్చారు. సంస్కృతీకరణలో చాలా చోట్ల ప్రధానపాత్ర ఆధిపత్య కులానిది. ప్రతి ప్రాంతంలోనూ ఒకటో రెండో ఆధిపత్య కులాలు (కమ్మ, రెడ్డి, వెలమ, కాపు, ఒక్కలిగ, మరాఠీ లాంటివి) ఉంటాయి. సాధారణంగా వీటి ఉనికి ఆయా ప్రాంతాలకే పరిమితమై ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఆధిపత్య కులాలు ఉంటాయి. ఈ కులాల చేతుల్లో సారవంతమైన భూములు ఉంటాయి. సంఖ్యాబలం కూడా ఉంటుంది. వీళ్ల మీద ఆధారపడి వృత్తి, సేవా కులాలు మనుగడ సాగించేవి. ఈ ఆధిపత్య కులాలను అనుకరించటం సంస్కృతీకరణలో చాలా చోట్ల కనపడుతుంది.
రాజ్యాధికారం కులాల బలాబలాలను చాలా ప్రభావితం చేసింది. రాజ్యాలను పాలించిన వాళ్లల్లో ఎక్కువ మంది కింది కులాల నుంచి వచ్చిన వారే. అధికారాన్ని పొందిన తర్వాత వీళ్లని స్వచ్ఛశూద్రులని అన్నారు. అధికారాన్ని సుస్థిరం చేసుకుని బ్రాహ్మణులను పోషించటం మొదలుపెట్టాక క్షత్రియ హోదాను సంపాదించారు. తాము ఎప్పటి నుంచో క్షత్రియులమని చెప్పటానికి కల్పిత వంశచరిత్రలను రాయించుకున్నారు. యుద్ధాలతో రాజ్య వ్యవస్థ నిరంతరం ఒడిదుడుకులకు లోనయ్యేది. కేంద్రీకృత రాజ్యాలు మనకు తక్కువ. పరస్పరం సంఘర్షించే రాజ్యాలే ఎక్కువ. ఈ పరిస్థితి నిరంతర సైన్య సమీకరణకు అనుకూలంగా ఉండేది. సొంత కులం నుంచి సాహసికులను సమీకరించుకుని పోరాడిన వారికి రాజ్యాధికారం కొన్నిసార్లు దక్కేది. దాంతో కుల సామాజిక హోదా పెరిగేది. భక్తి ఉద్యమం కూడా సంస్కృతీకరణకు చాలా దోహదం చేసింది. ఒక మనిషి గౌరవం పుట్టుక కంటే అతను చేసే పనుల పై ఆధారపడి ఉంటుందని భక్తికవులు బలంగా చెప్పారు. భక్తికి కర్మకాండలు అవసరం లేదని ప్రచారం చేశారు. అందుకే కింది కులాల నుంచి కూడా భక్తికవులు వచ్చారు. సంస్కృతీకరణలో మరో కోణం కూడా ఉంది. కింది కులాల అలవాట్లను కూడా పై కులాల వాళ్లు స్వీకరించిన ఉదంతాలూ ఉన్నాయి. కేరళలో కొన్ని చోట్ల పితృస్వామ్యం నుంచి మాతృస్వామ్యానికి మారిన సంఘటనలు కనపడతాయి. ఇక కుల వ్యవస్థలేని గిరిజనులపై కూడా సంస్కృతీకరణ ప్రభావం పడింది. అంటే కులాలు లేని చోట్ల అవి ఏర్పడేలా చేసింది. ఇక్కడ అనుకరణ తెగల్లో కులాలకు దారితీసింది.
మన చరిత్రను నిశితంగా చూస్తే మార్పులకు నోచుకోని జడపదార్థాల్లాగా కులాలను భావించలేం. సంస్కృతీకరణ వల్ల అర్థమయ్యేది అదే. సంస్కృతీకరణ వల్ల కులాల స్థానాలు మారాయి. కుల వ్యవస్థ మాత్రం మౌలికంగా చెక్కుచెదరలేదు. మధ్యస్థాయి కులాలు పలుచోట్ల పైకి ఎగబాకినా ముఖ్యంగా దళితులకు ఆ అవకాశం సైతం దక్కలేదు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ భావనలు బలమైన ఆదర్శాలుగా మన ముందుకు రానంతవరకూ కులవ్యవస్థ సృష్టించిన హెచ్చుతగ్గుల భావనలకు సవాళ్లు ఎదురుకాలేదు. వాటిని ఎదుర్కొనీ కుల భావనలు మనుగడ సాగించటం అంటే అసలైన ప్రజాస్వామ్య భావాలకు మనం చాలా దూరంలో ఉన్నట్లే లెక్క. ప్రస్తుతం మనకున్నది కుల భావనలు, కుల డిమాండ్లతో నిండిన ప్రజాస్వామ్యమే అన్నది మా భావన.