అక్రమ మైనింగ్ పై పోలీసుల దాడులు... ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... పోలీసు అధికారి భూమి కబ్జా చేసి క్వారీ... బిఅర్ఏస్ కీలక నేత అండతోనే కబ్జా... సీపీ చర్యలతో అసలు కథ వెలుగులోకి...

Submitted by SANJEEVAIAH on Sat, 17/02/2024 - 08:15
kvary

అక్రమ మైనింగ్‌లపై పోలీసుల దాడులు

పోలీసుల అదుపులో ముగ్గురు నిర్వహకులు

పోలీసు అధికారి భూమి కబ్జా

కబ్జా చేసి మరి మైనింగ్‌ నిర్వహణ

బిఅర్‌ఎస్‌ కీలక నేత అండతో మైనింగ్‌

పదేళ్లుగా పోలీసు అధికారి గోడు వినని అధికారులు

సీపీ చర్యలు అసలు బాగోతం బయటకు

ఊపీరి తీస్తున్న మైనింగ్‌ క్వారీ

(నిజామాబాద్‌ బ్యూరో ` ప్రజాజ్యోతి ` ఏడ్ల సంజీవ్‌) 

అక్రమ మైనింగ్‌లపై పోలీసుల దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనాలకు విరుద్దంగా కొనసాగుతూ, స్థానికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న క్వారీలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. పోలీసు కమిషనర్‌ కల్మేశ్వర్‌ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. జిల్లాలో మైనింగ్‌ మాఫీయా తీరు రోజుకోక రకంగా మారుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనింగ్‌ అధికారులు లోసుగులు పూర్తిగా బయట పడుతున్నాయి. సీపీ కల్మేశ్వర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు విస్త్రతంగా దాడులు చేస్తు కేసులు నమోదు  చేస్తున్నారు. వాస్తవంగా మైనింగ్‌ అధికారులు దాడులు చేసి నిబంధనాలకు విరుద్దంగా పని చేస్తున్న క్వారీలను మూసివేయించాలి. కానీ నెలసరి మాముళ్లకు కక్కుర్తి పడిన అధికారులు వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానికులు ఫిర్యాదు చేసిన తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ సీపీ కల్మేశ్వర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ప్రత్యేక బృందాలతో దాడులు చేయించి మరి కేసులు నమోదు చేస్తు క్వారీలను మూయిస్తున్నారు. ఇటీవల బోధన్‌, మోస్రా, మాక్లూర్‌లలో దాడులు చేసారు. అలాగే శుక్రవారం భీంగల్‌ మండలం మెండోరాలోని రెండు క్వారీలలో స్థానిక పోలీసులతో కలిసి దాడులు చేసారు. ఈ క్వారీలు నిబంధనాలకు విరుద్దంగా కొనసాగడమే కాకుండా అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో కొందరు బాధితులు సీపీకి ఫిర్యాదు చేయడంతో దాడులు చేసినట్లు సమాచారం. అయితే శుక్రవారం జరిగిన దాడులను పోలీసులు గుట్టుగా ఉంచారు. ఈ దాడులలో క్వారీలను నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు భీంగల్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.  

పోలీసు అధికారి భూమి కబ్జా... అపై మైనింగ్‌...

రాజు తలుచుకుంటే కోరడా దెబ్బలకు కొదవా అన్నట్లుగా మారింది. బిఅర్‌ఎస్‌ పార్టీకి చెందిన కీలక నేత అండతో ఓ రిటైర్డు పోలీసు అధికారి (అడిషనల్‌ ఎస్పీ) దామెదర్‌రెడ్డికి చెందిన భూమిని అక్రమంగా కబ్జా చేసుకున్నారు. అనుమతుల సంగతి ఏలా ఉన్న కబ్జా చేసి మరి మైనింగ్‌ నిర్వహించడం ఇక్కడ విశేషం. అ పోలీసు అధికారి ఏన్ని ఫిర్యాదులు చేసిన, ఆర్టిఐలో ధరఖాస్తు చేసిన పదేళ్ల పాటు పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. అయిన దీంట్లో అక్రమంగా మైనింగ్‌ చేస్తున్నారు. దీంట్లో డిజైనర్‌ క్వారీ పేరుతో ఏలాంటి అనుమతులు లేకుండా క్వారీ నిర్వహిస్తున్నారు. ఈ క్వారీ వల్ల సుమారు 8 మంది మరణించినట్లు అరోపణలు ఉన్నాయి. ప్రతి నెల గ్రామానికి రూ.4 నుంచి రూ.5 లక్షల మేరకు, అధికారులకు స్థాయిని బట్టి నెలసరి మాముళ్లు ఇవ్వడంతో ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానిక పోలీసుల నుంచి మొదలుకుంటే జిల్లా అధికారుల వరకు మాముళ్లు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది. అందుకే ఈ క్వారీవైపు అధికారులు రానేరారు అనేది స్థానికుల వాదన. ఈ భూమి వివరాల కోసం పోల్యూషన్‌ బోర్డు, మైనింగ్‌ అధికారులు ఏలాంటి వివరాలు ఇవ్వడం లేదు. చివరకు ఆర్టిఐలో ధరఖాస్తు చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో సదరు అధికారి సీపీ కల్మేశ్వర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం బయటకు వచ్చింది. దీంతో ప్రత్యేక బృందాలతో దాడులు చేయించిన క్వారీ నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు.

ఏం జరుగుతుంది...?

నిన్నటి వరకు బాల్కోండ నియోజక వర్గంలో అక్రమ మైనింగ్‌, ఇసుక మాఫీయా రణరంగంగా మార్చింది. పలుచోట్ల గ్రామ అభివృద్ది కమిటీ (విడిసి)లను అడ్డం పెట్టుకోని ఇష్టారాజ్యంగా కొనసాగించారు. మెండోరా, కమ్మర్‌పల్లి, భీంగల్‌, పెద్దవాల్గోట్‌ ఇలా అక్రమంగా మైనింగ్‌ చేయడమే కాంకుడా ఎదురు తిరిగిన, ఫిర్యాదులు చేసిన దాడులు చేసి మరి బెదిరింపులకు దిగారు. గతంలో జర్నలిస్టులను సైతం బహిరంగంగానే దాడులు చేసి చితకబాదారు. ఇలా పలుమార్లు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల వారు ఫిర్యాదు చేసిన అధికారుల్లో స్పందన లేకుండా పోయింది. కానీ ఇటీవల పోలీసు శాఖ బాస్‌ ప్రత్యేకంగా వీటిపై దృష్టిసారించడం కొత్త చర్చకు దారి తీసింది. మరోపక్క విడిసిలపై సైతం సీపీ హుక్కుపాదం మోపడంతో మైనింగ్‌, ఇసుక అక్రమార్కులపై ఫిర్యాదులు చేసిన వారి సంఖ్య పెరుగుతుంది. విడిసిలపై సీపీ కోరడా జులిపించడంతో అయా ప్రాంతాల్లోని విడిసిలు వెనకడుగు వేస్తున్నారు.