కార్తీకంతో మోగిన పెళ్లి బాజాలు

హైదరాబాద్‌ : కార్తీక మాసంతో మళ్లీ శుభ ముహూర్తాలు ప్రవేశించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ నిబంధనలు సడలింపుతో పెళ్లిసందడి మొదలైంది. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిన వివాహాలతోపాటు కొత్తగా నిశ్చయించుకున్నవారు కార్తీక మాసంలోని ముహూర్తాల్లో పెళ్లిళ్లు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారం నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో అనేకచోట్ల పెళ్లి సందడి కనిపిస్తోంది. మునుపటిలా కాకున్నా పూలు ,పళ్లు, ఇతర సామాగ్రి కొనుగోళ్ల సందడి కానవస్తోంది. తాజా పరిస్థితుల్లో కరోనా సమయంలో వెలవెలబోయిన షాపింగ్‌మాళ్లు, దుకాణాలు కూడా కళకళలాడుతున్నాయి. అలాగే నగరంతో పాటు జిల్లాల్లోని ఫంక్షన్‌హాళ్లకు డిమాండ్‌ పెరిగింది. మంచి ముహూర్త సమయంలో ఫంక్షన్‌హాళ్లు దొరకకపోవడంతో ఇళ్ల వద్దనే పెళ్లిళ్లు చేయడానికి నిర్ణయించుకుంటున్నారు. ఆరు నెలల పాటు పనులు లేక ఇబ్బందులు పడ్డవారు బిజీబిజీగా మారిపోయారు. బంగారు, వస్త్ర దుకాణాలు సందడిగా మారాయి.

పంతుళ్లు, సన్నాయి మేళంవారికి, వంట మనుషులు , ఫొటో వీడియో గ్రాఫర్లు, పెళ్లి కార్డు ఫ్రింటింగ్‌, డేకరేషన్‌ పనులు చేసేవారికి ఉపాధి లభించనుంది. కార్తీక మాసంలోని మంచి ముహూర్తాలతో పెళ్లిళ్లు మొదలయ్యాయి. ఇందులో నవంబరులో 20, 21, 22, 25, 26, 27, 28, 30 తేదీల్లోని ముహూర్తాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా నిర్వహించనున్నారు. డిసెంబరులో 2, 4, 6, 9, 10, 11 తేదీల్లోనూ వివాహాలు జరగనున్నాయి. ఈ సంవత్సరం డిసెంబరు 14 వరకు కార్తీక మాసం ఉంది. 2021లో జనవరి 6 వరకు ముహూర్తాలు ఉన్నాయి. జనవరి 13 నుంచి పుష్యమాసంలో గురుమూఢం ఉంటుంది. ఫ్రిబవరి 12 నుంచి మాఘమాసం మొదలై మూఢం కొనసాగుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌ 13న ఉగాదితో పల్లవ నామ సంవత్సరం మొదలై మూఢం కొనసాగుతుంది. మంచి ముహూర్తాలు కావాలంటే ఆరు నెలాలపాటు ఆగాల్సిన పరిస్థితి. దీంతో ఈ రెండు నెలల్లోనే పెళ్లిళ్లు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే కరోనాతో పరిమిత సంఖ్యలోనే బంధువులకు ఆహ్వానాలు వెళుతున్నాయి

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *