మేడ్చల్ : ఐపీఎల్ బెట్టింగ్‌కు, జల్సాలకు బానిసైన యువకుడు తల్లికి, సోదరికి విషమిచ్చి హతమార్చిన సంఘటన వేలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావకోల్ గ్రామానికి చెందిన సాయినాథ్‌రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి ఇటీవల అకాల మరణం చెందడంతో అతడి పేరిట ఉన్న ఇన్సూరెన్స్ 20 లక్షల నగదు అందింది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయినాథ్ రెడ్డి దురలవాట్లకు బానిసయ్యాడు. జులాయిగా తిరుగుతూ మొత్తం డబ్బును ఖర్చు చేశాడు. ఈ విషయంపై తల్లి, చెల్లెలు ఎక్కడ నిలదీస్తారోనని భయపడిన అతను ఈ నెల 23న ఉదయం అన్నం వండి అందులో విషం కలిపి తల్లి సునీతా రెడ్డి (42), సోదరి అనూష (20)కు పెట్టాడు.
పథకం ప్రకారం ముందే సిద్ధం చేసుకున్న ఆహారాన్ని తీసుకుని ఆఫీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం అన్నం తిన్న సునీత, అనూష అస్వస్థతకు గురయ్యారు. తల్లి సునీత కుమారుడికి ఫోన్ చేసి ఆ అన్నం తినవద్దని చెప్పింది. 23వ తేదీ సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన సాయినాథ్ రెడ్డి అపస్మారక స్థితిలో ఉన్న తల్లి, చెల్లిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీత 27న మృతిచెందగా.. అనుష 28న కన్నుమూసింది. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానికి సీఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. నిందితుడు సాయిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీకి తరలించి విచారిస్తున్నారు.