సంజయ్‌ మంజ్రేకర్‌ పునరాగమనం..

ముంబై : టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ పునరాగమనం చేయనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న భారత్‌ ఆస్ట్రేలియా సిరీస్‌లో మంజ్రేకర్‌ వ్యాఖ్యానం చేయనున్నాడు. ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తున్న క్రికెట్‌ ఆస్టేల్రియా (సీఏ)కే కామెంట్రీ ప్యానెల్‌ ఎంపిక సహా ఇతర నిర్ణయాలను తీసుకునే హక్కుంది. మంజ్రేకర్‌ను క్రికెట్‌ఆస్ట్రేలియా కామెంట్రీ ప్యానెల్లో చేర్చే అవకాశం ఉంది. దీంతో గత మార్చి నెల నుంచి ఖాళీగా ఉంటున్న మంజ్రేకర్‌.. ఇకపై బిజీబిజీ కానున్నాడు. తన వ్యాఖ్యానంతో అభిమానులను అలరించనున్నాడు.

సంజయ్‌ మంజ్రేకర్‌తో పాటు గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, నిక్‌ నైట్‌, హర్షా భోగ్లే, అజయ్‌ జడేజా, మురళీ కార్తీక్‌, అజిత్‌ అగార్కర్‌ కూడా కామెంట్రీ ప్యానెల్‌లో ఉండనున్నారు. 2016లో కామెంటేటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. హిందీ కామెంట్రీ ప్యానెల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. జహీర్‌ ఖాన్‌, వజియ్‌ దహియా, మహ్మద్‌ కైఫ్‌, వివేక్‌ రజ్దాన్‌, అర్జున్‌ పండిట్‌ హిందీ కామెంట్రీ ప్యానెల్‌లో భాగం కాబోతున్నారు. మొత్తానికి సుదీర్ఘ ఆసీస్‌ పర్యటన సందర్భంగా మంజ్రేకర్‌, సెహ్వాగ్‌ పునరాగమనం చేయనున్నారు. సంజయ్‌ మంజ్రేకర్‌కు మంచి క్రికెట్‌ పరిజ్ఞానం ఉంది. అంతకుమించి ఇంగ్లీష్‌ భాషలో గలగలా మాట్లాడుతూ అద్భుతంగా కామెంటరీ చేయగలడు.

అయితే ఆ కామెంటరీకి కొన్ని సందర్భాల్లో వివాదాస్పద పదాలుజోడించడంతో.. మంజ్రేకర్‌ వివాదంలో చిక్కుకున్నాడు. గతంలోనూ ఐపీఎల్‌ సమయంలో ముంబై ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ని ’మతిలేని క్రికెటర్‌’ అంటూ సెటైర్‌ వేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ’బిట్స్‌ అండ్‌ పీసెస్‌’ అంటూ చేసిన వ్యాఖ్యకు టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తీవ్రంగా బదులిచ్చాడు. ఇక సహచర కామెంటేటర్‌ హర్షా భోగ్లాని హేళన చేస్తూ మాట్లాడినప్పుడు సోషల్‌ విూడియాలో పెద్ద దుమారం చెరేగింది. దీంతో గత మార్చిలో దక్షిణాఫ్రికా సిరీస్‌ సమయంలో మంజ్రేకర్‌పై బీసీసీఐ వేటు వేసింది. బీసీసీఐ తనని కామెంట్రీ ప్యానెల్‌ నుంచి తప్పిండంపై సంజయ్‌ మంజ్రేకర్‌ స్పందించాడు. నేను ఎవరినీ నొప్పించాలనుకోలేదు, నా హద్దు నాకు తెలుసు అని వివరణ ఇచ్చుకున్నా.. బీసీసీఐ స్పందించలేదు. ఇక ఐపీఎల్‌ 2002 కామెంట్రీ ప్యానెల్‌లో తనకు చోటు కల్పించాలని మంజ్రేకర్‌ రెండు సార్లు బీసీసీఐకి లేఖ రాసినప్పటికీ.. ఫలితం లేకపోయింది.

మంజ్రేకర్‌ను కామెంట్రీ ప్యానెల్‌ నుంచి తప్పించడం వెనుక కారణాలను బీసీసీఐ ఇప్పటికీ వెల్లడించలేదు . కానీ అతనిపై మాత్రం వేటు వేసింది. అయితే ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తున్న.. క్రికెట్‌ ఆస్ట్రేలియ కె కామెంట్రీ ప్యానెల్‌ ఎంపిక సహా ఇతర నిర్ణయాలను తీసుకునే హక్కుంది. కాబట్టి అతడు మళ్లీ రంగప్రవేశం చేసేందుకు అవకాశం ఉంది. భారత్‌ ఆస్ట్రేలియా పర్యటన మూడు వన్డేల సిరీస్‌తో ప్రారంభం కానుంది. నవంబర్‌ 27, 29, డిసెంబర్‌ 2 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. డిసెంబర్‌ 4, 6, 8 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆపై బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా తొలి టెస్టు (డే/నైట్‌) ప్రారంభం కానుంది. తర్వాతి టెస్టుకు మెల్‌బోర్న్‌ (డిసెంబర్‌ 26), సిడ్నీ (జనవరి 7), బ్రిస్బేన్‌ (జనవరి 15) ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *