స్నేహం ముసుగులో నమ్మించి సామూహిక అత్యాచారం...!

హైదరాబాద్ : స్నేహం పేరుతో ఓ యువతిని నమ్మించి తన పుట్టినరోజు పేరుతో కేక్‌లో మత్తు మందు ఇచ్చి ముగ్గురు స్నేహితులు యువతిపై అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకావడంతో కూకట్‌పల్లికి కేసు బదిలీ చేశారు. 24 గంటల్లో కూకట్‌పల్లి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సంఘటనకు సంబంధించి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్‌రావు వివరాలు వెల్లడించారు: జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి బోరబండ వినాయకనగర్‌కు చెందిన ఓ యువతి(19)తో స్థానికంగా నివాసముండే మాధోజి జోసెఫ్‌(20), బొందగడ్ల నవీన్‌రెడ్డి(22), రాగని రాము(23)లు గత కొంత కాలంగా స్నేహంగా మెలిగే వారు.

పుట్టినరోజు పేరుతో కేక్‌లో మత్తు మందు ఇచ్చి…
ఈ నెల 5వ తేదీన యువతి తన కళాశాల ఫీజు చెల్లించడానికి ఇంటి నుంచి బయటికి వచ్చింది. అదే సమయంలో యువతికి జోసెఫ్‌ ఫోన్‌ చేసి తన పుట్టినరోజు ఉంది, పార్టీ చేసుకుందాం అని చెప్పి వెంట తీసుకువెళ్లాడు. ముందుగా నగరంలోని ట్యాంక్‌ బండ్‌ తదితర ప్రదేశాల్లో తిరిగారు. తరువాత కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీలోని ఓయో ఆనంద్‌ ఇన్‌ లాడ్జిలో రూం తీసుకున్నాం.. పుట్టినరోజు వేడుకలు అక్కడే ఉన్నాయని నమ్మించి వెంట తీసుకువెళ్లారు. లాడ్జిలోని రూం నంబర్‌ 218లోకి వెళ్లిన తరువాత నవీన్‌రెడ్డి బయటికి వెళ్లి కొద్ది సేపటి తరువాత కేక్‌ తీసుకువచ్చాడు. పథకం ప్రకారం మత్తుమందు కలిపిన కేక్‌ను యువతికి తినిపించారు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ విషయం ఎవరికైనా చెప్పితే, చంపేస్తామని బెదిరించి యువతిని ఇంటి వద్దకు తీసుకు వెళ్లి వదిలిపెట్టారు. ఇదిలా ఉండగా మరుసటి రోజునుంచి యువతి అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు ఈ నెల 11న బోరబండ సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి ఎంతకు కుదట పడక పోవడంతో కుటుంబ సభ్యులు యువతిని ప్రశ్నించగా, జరిగిన విషయం తెలిపింది. దీంతో 15న బాధిత యువతి కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాపు చేపట్టిన జూబ్లీహిల్స్‌ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుండటంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్‌రావు నేతృత్వంలో సీఐ లక్ష్మీనారాయణరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. 24 గంటల్లోపు నిందితులు మాధోజి జోసెఫ్‌, బొందగడ్ల నవీన్‌రెడ్డి, రాగని రామును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *