ముంబై ప్రయాణికులను దోచుకుంటున్న ప్రైవేట్‌ ట్రావెల్స్

జగిత్యాల : దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైకి జగిత్యాల జిల్లా నుండి ప్రతి రోజూ ప్రయాణికులు ఎక్కువగా వెళ్తుంటారు. వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు అయిన ముంబై నుండి బట్ట దిగుమతి కూడా ఎక్కువగానే ఉంటుంది. బ్రతుకు దెరువు కోసం జగిత్యా జిల్లా నుండి లక్షల్లో ప్రజలు ముంబై వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈ నేపధ్యంలో జగిత్యాల నుండి ముంబైకు రాక పోకలు ఎక్కువగానే ఉంటాయి. జగిత్యాల నుండి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వారి బస్ లు నిత్యం 5 వరకు నడుస్తుంటాయి. ప్రతి బస్‌ ప్రయాణికుల తో నిండిపోతూ ట్రావెల్స్‌ యజమానులు బాగానే సంపాదిస్తూ ఉండేవారు. అయితే కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సుమారు 5 నెలలు రాకపోకలు పూర్తిగా బంద్‌ అయ్యాయి. ఇటీవలే ముంబై నుండి జగిత్యాల కు రాకపోకలు ప్రారంభం కాగా కరోనాను సాకుగా చూపి ట్రావెల్స్‌ నిర్వాహకులు ప్రయాణికుల నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు. లాక్‌ డౌన్‌ కు ముందు ఒక్కొక్కరికి రూ.600 నుండి 1000 రూపాయల వరకు వసూలు చేసేవారు.

కాగా ప్రస్తుతం కరోనా ఛార్జ్‌ లు అంటూ ఒక్కో ప్రయాణికుని వద్ద రూ.2500 నుండి 3000 వసూలు చేస్తున్నారు. గేజీ ఛార్జ్ లు అదనంగా వసూలు చేస్తూ జేఋ దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల అనుమానాలకు తావిస్తోంది. గతంలో అప్పటి జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్‌ రావు ముంబైకి వెళ్లే ప్రైవేట్‌ బస్‌ లు నిబంధనలు పాటించడం లేదని గుర్తించి వాటిని సీజ్‌ చేయడం జరిగింది. అయితే ప్రస్తుత రవాణా శాఖ అధికారి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు జగిత్యాల నుండి ముంబై వెళ్ళే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్‌ లను తనిఖీ నిర్వహించి నిబంధనల ప్రకారం బస్‌ లు నడిపేలా చూడాలని, ప్రయాణికులను దోచుకునే వారిపై చర్యలు తీసుకోవాని ప్రజలు కోరుతున్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *