నాయిని లేని లోటు పూడ్చలేనిది మరణం బాధాకరం

జగిత్యాల : తెలంగాణ ఉద్యమ కారులు, తెలంగాణ రాష్ట్ర తొలి హోం శాఖ మంత్రి, కార్మికనేత నాయిని నర్సింహారెడ్డి మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని రెడ్డి జేఏసీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మరణం బాధాకరమన్నారు. గురువారం జగిత్యాలలో నాయిని నర్సింహారెడ్డి సంతాప సభను రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కార్మిక నేతగా సుపరిచితుడైన నాయిని నర్సింహారెడ్డి 1944 మే 12న జన్మించారని, స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగొమ్ము గ్రామం కాగా చిన్నప్పటి నుంచి ఉద్యమబావాలను పుణికి పుచ్చుకున్న పోరాట యోధుడు నర్సింహారెడ్డి అని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో మొదట్నుంచీ కీలక పాత్ర పోషించిన నాయిని తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని చెప్పారు. గొప్ప పోరాట యోధుడు, పేరొందిన కార్మిక నాయకులు, మంచి మనిషి నాయిని అని పేర్కొన్నారు. పలు ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికయ్యారన్నారు. 1970లో హైదరాబాద్‌కు మకాం మార్చిన నాయిని నర్సింహారెడ్డి వీఎస్‌టీ కార్మిక సంఘం నేతగా పలుమార్లు ఎన్నికయ్యారని వివరించారు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారని కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన “నాయిని “ముషీరాబాద్ శాసనసభ్యుడిగా మూడుసార్లు గెలువగా మొదటిసారి 1978లో టి.అంజయ్యపై విజయం సాధించిన నర్సింహారెడ్డి 1985, 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

2001లో తెరాసలో చేరిన ఆయన తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ వెంట కీలకంగా వ్యవహరించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో నర్సింహారెడ్డి 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం కేసీఆర్ కేబినెట్ లో తొలి హోంమంత్రిగా పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన గొప్ప వ్యక్తి నాయిని నర్సింహారెడ్డి అని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని , అలాగే ఆయన కుటుంబానికి కిషన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమావేశంలో రెడ్డి జేఏసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్ది మహేశ్వర్ రెడ్డి, ప్రతినిధులు మందల గోపాల్ రెడ్డి, సంత నిరంజన్ రెడ్డి, జితెందర్ రెడ్డి, యాళ్ల మధూ రెడ్డి, నాగిరెడ్డి గోపాల్ రెడ్డి, తాటి పర్తి రాజేందర్ రెడ్డి, నవీన్ రెడ్డి, రజిత, వరలక్ష్మి, ప్రేమలత, పద్మ, లక్ష్మి, మంజుల, తదితరులు పాల్గొన్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *