భద్రాద్రికొత్తగూడెం (ప్రజాజ్యోతి) : కేంద్రంలోని మోది పాలన నాటి బ్రిటీష్ తెల్లదొరల, రజాకార్ల పాలనను తలపిస్తోందని, చట్టసభల్లో ఉన్న మందబలంతో రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకువస్తూ నిరంకుషపాలనను సాగిస్తున్నాడని సీపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ స్వాతంత్యంకోసం ప్రాణాలు అర్పించిన సర్థార్ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ 90వ వర్ధంతిని కేంద్ర ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేకదినంగా జరిపారు. బస్టాండ్ సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ సెంటర్ వరకు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు.. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కూనంనేని మాట్లాడారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలతో వ్యవసాయరంగం త్రీవ సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇప్పటికే నాలుగు లక్షల మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం కొత్త సాగు చట్టాలు ఎంత నష్టానికి కారణమవుతున్నాయో స్పష్టమవుతోందన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం వేగంగా అడుగులు వేస్తూ ఉద్యోగులను, కార్మికులకు రోడ్డుపాలే చేసే చర్యలకు పూనుకుంటోందని అన్నారు.
నాడు భగత్‌సింగ్‌కు ఉరితాడు… నేడు రైతన్నలకు ఉరితాడు : రైతు సంఘాలు
నాడు దేశ స్వాతంత్ర్యంకోసం పోరాడుతున్న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్గ్దేవ్లను బ్రిటీష్ దొరలు ఉరివేశారని, నేడు దేశ ప్రజలకు అన్నంపెట్టే రైతన్నలకు మోడీ ప్రభుత్వం తమ చట్టాలతో ఉరితాళ్ళు బిగిస్తోందని విమర్శించారు. రాష్ట్రాల విభజన చట్టంలో హామీ మేరకు బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వర్పాటు చెయబోమని కేంద్రం తేల్చిచెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వంత వైఖరి అవలంబిస్తోందని, ఓవైపు నూతన సాగు చట్టాలకు పరోక్షంగా మద్దతు తెలుపుతూ మరోవైపు మోసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రైతుల పట్ల చిత్తపద్దీ ఉంటే ఈ చట్టాలపై అసెంబ్లీలో తీర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాలకు విరామం ఉండబోదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, సిపిఎం జిల్లా నాయకులు గుగులోత్ ధర్మ ధర్మ, న్యూడెమోక్రసి జిల్లా నాయకులు పి.సలీష్, ఎల్విశ్వనాధం మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, వై.శ్రీనివాసరెడ్డి దమ్మాలపాటి శేషయ్య, కందుల భాస్కర్, నేరెళ్ళ శ్రీను, క్రాంతి, భూక్య రమేష్, జలాల్ న్యూడెమోక్రసి జిల్లా నాయకులు ఎన్.సంజీవ్, అలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.