రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? : భట్టి ఆగ్రహం..

ఖమ్మం (మధిర) : రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నదా? అని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క అనుమానం వ్యక్తం చేశారు. వరద ముంపుకు గురైన ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురిసి వరదలతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వరద బీభత్సంతో రాష్ట్రంలో ఉన్న అన్ని జాతీయ రహదారులు సైతం వరద దిగ్బంధానికి గురైందన్నారు. ప్రభుత్వం కనీసం ట్రాఫిక్ను కూడా క్లియర్ చేయడంలో విఫలం చెందారన్నారు. దీనివల్ల ప్రజలు గంటల తరబడి జాతీయ రహదారిపై ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. అకాల వర్షాలకు రాష్ట్రంలో 11 మంది మృతి చెందినా, హైదరాబాద్ ను వరదలు ముంచెత్తినా, మంత్రులుగానీ, ముఖ్యమంత్రి గానీ, స్పందించడం లేదన్నారు.

వరదల్లో చిక్కుకున్న వారికి సహాయ చర్యలు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనను గాలికొదిలేసి ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. 60 సంవత్సరాల క్రితం నిర్మించిన మధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకున్నదని ఆయన తెలిపారు. ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి నూతన భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. శివాలయం వద్ద లిఫ్టు నిర్మిస్తే మధిర మునిగిపోతుందని, అందువల్ల ఆ ప్రాంతంలో కేవలం హైలెవెల్ బ్రిడ్జి మాత్రమే నిర్మించాలని, ఆయన ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, పారుపల్లి విజయ్, మునుగోటి వెంకటేశ్వర్లు, మిరియాల కాశయ్య, షేక్ జహింగీర్, పులిబండ్ల చిట్టి బాబు,కోరంపల్లి చంటి, తదితరులు పాల్గొన్నారు

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *