బిజెపి కి జనసేన మద్దతుతో గ్రేటర్లో అనుకూల వాతావరణం

హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాకతో బీజేపీలో ఉత్సాహం నెలకొంది. ఓవైపు చేరికలు, మరోవైపు జనసేన మద్దతు బిజెపిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. నగర ఎన్నికల్లో ఇది బూస్ట్ ఇచ్చేదిగా పార్టీ నేతలు భావిస్తున్నారు. పవన్ అభిమానులు బిజెపికి ప్రచారం చేస్తారని అంటున్నారు. పవన్ తమకు మద్దతు ఇవ్వడంతో పరిస్థితిని మార్చేస్తాయని బిజెపి నేతలు అంటున్నారు. పవన్ రాకతో తమ దశ తిరుగుతుందని, గెలుపు దిశగా దూసుకువెళతామని అంటున్నారు. పోటీ చేస్తానన్న పవన్ కల్యాణ్ వెనక్కితగ్గి బీజేపీకి మద్దతు ప్రకటించారు. బీజేపీ కోసం క్యాంపెన్ కూడా చేస్తామంటున్నారు. అదే జరిగితే ఆంధ్ర సెటిలర్ల ఓట్లు తమకే వస్తాయని కమలనాథులు అనుకుంటున్నారు. గతంలో ఆంధ్ర సెటిలర్లు టీడీపీకి మద్దతు ఇచ్చినా.. విభజన తర్వాత చంద్రబాబు వచ్చినా పట్టించుకోలేదు. ఇక్కడ ఉండాలి కాబట్టే మంచిగా ఉండడమే బెటర్ అనుకుని టీఆర్ఎస్కే జై కొట్టారు. కాంగ్రెస్ వైపు చూద్దామన్నా నమ్మకం కుదరలేదు.

ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ కనబడుతోంది. పైగా బీజేపీ అండ ఉంటే టీఆర్ఎస్కు భయపడనక్కరలేదనే భావన నేతల్లో, ప్రజల్లోనూ వచ్చినట్లు కనబడుతోంది. అందుకే వారంతా బీజేపీకి ఓట్లు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారని, ఇప్పుడు వారిపై పవన్ కల్యాణ్ ప్రభావం పడితే ఫిక్స్ అయిపోతారని అంటున్నారు. ఇకపోతే కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి సర్వే ఇంటికి వెళ్లి చర్చ జరిపారు.

అనంతరం సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. తాను కేంద్ర మాజీ మంత్రి అయినందున ప్రొటోకాల్ పాటించాల్సి వస్తుందని, నాలుగు రోజుల క్రితమే సోనియాకు లేఖ రాశానని తెలిపారు. తనతోపాటు తన నియోజకవర్గంలో పేరున్న డివిజన్ నాయకులంతా బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో ఎంపీలందరం ఢల్లీిలో పోరాడితే.. కేసీఆర్ మాత్రం ఇంట్లో కూర్చొని డైలాగులతో తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారని తెలిపారు. సోనియాగాంధీ తల్లిలాంటిదని, అయితే ఆమె ఆరోగ్యం క్షీణించిందని, ఢల్లీిలో కాంగ్రెస్ నేతలు సరిగా లేరని అన్నారు. తెలం గాణ ఇచ్చిన సోనియా కలను నిజం చేసేందుకు తాను బీజేపీలో చేరుతున్నానన్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ ఎన్నిక ఇన్చార్జి భూపేంద్రయాదవ్ భేటీ అయ్యారు. ఆ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడొకరితో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి వద్దకు వెళ్లినట్లు, సుమారు అరగంటపాటు వీరి మధ్య చర్చ\ జరిగినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిని విశ్వేశ్వర్‌రెడ్డి ఖండించారు. ఇది పుకారు మాత్రమేనని, తనకు బీజేపీ సహా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల్లోనూ స్నేహితులున్నారని చెప్పారు

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *