టిఆర్ఎస్ లో కసి....బిజెపిలో ఉత్సాహం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార వేడి రాజుకుంటోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు అధికార టిఆర్ఎస్, బిజెపి జోరు మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది.ఈ పార్టీ నేతలే ఎక్కువగా ప్రచారంలో కనిపిస్తున్నారు. నువ్వానేనా అన్నట్లు ఇరుపార్టీలు రంగంలోకి దిగాయి. దుబ్బాక ఫలితం ఊపులో బిజెపి ఉంటే..ఓడిపోయిన కసిలో టిఆర్ఎస్ ఉంది. అందుకే ఈ రెండు పార్టీలు జిహెచ్ఎంసి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడు తున్నాయి. టిక్కెట్ల కోసం ఈ రెండు పార్టీల్లోనే పోటీ ఎక్కువగా కనిపించింది. ఆయారామ్ గయారామ్‌లు కూడా ఈపార్టీల్లోనే కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంది. పిసిసి చీఫ్ ఉత్తమ్ను మారుస్తారన్న నమ్మకంతో ఇంతకాలం నేతలు ఉన్నారు. దుబ్బాకలో మూడోస్థానానికి చేరడం, డిపాజిట్ కోల్పోవడంతో ఆ పార్టీలో నైరాశ్యం కన్పిస్తోంది. అలాగే కొందరు సీనియర్ నేతలు బిజెపిలోకి క్యూ కట్టారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సర్వే సత్యనారాయణ లాంటి వారు పార్టీ మారి బిజెపిలోకి వెళతారన్న ప్రచారం జోరుగసాగుతోంది. అధికార టిఆర్ఎస్ చేరికపైనే ప్రధానంగా దృష్టి సారించి బిజెపిని దెబ్బకొట్టే యత్నాలు ముమ్మరం చేసింది. దీంతో టిఆర్ఎస్కు పోటీ బిజెపి మాత్రమే అన్న భావన నేతల్లో ఏర్పడింది. దీనికితోడు ఉమ్మడి నాయకత్వం బిజెపికి కసి వస్తోంది.

బిజెపి కూడా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని పట్టు నిలుపుకునేందుకు గతంలో ఎప్పుడూ లేనంతగా దూకుడు ప్రదర్శిస్తోంది. నేతలు డివిజన్ల వారీగా పంచుకుని ప్రచారంలో సాగుతున్నారు. టిఆర్ఎస్ కూడా చాలా వ్యూహాత్మకంగా సాగుతోంది. మొత్తం పార్టీ యంత్రాంగాన్ని దించింది. అన్ని జిల్లాలకు చెందిన నేతలు రంగంలోకి దిగారు. కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా ఓటర్లను గుర్తించి వారిని ప్రభావితం చేసేలా టిఆర్ఎస్ ప్లాన్ చేసింది. సర్వసైన్యాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రిసడెంట్ కెటిఆర్ దూకుడుగా సాగుతున్నారు. పార్టీలో ఆత్మస్థయిర్యం నింపుతున్నారు. మొత్తంగా నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోయింది. ఇప్పటికే అధికార, విపక్షాలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ శనివారంనుంచి రంగంలోకి దిగారు. గతేడాది ఒంటి చెత్తో టీఆర్ఎస్ను గెలిపించాడు. అదే స్ఫూర్తి తో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటున్నారు. గ్రేటర్లో గొలుపే క్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు వెళుతోంది.

ఈ మేరకు టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ను అధిష్టానం ప్రకటించింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, ఈటల , సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, కొప్పుల , పువ్వాడ అజయ్ పేర్లను హైకమాండ్ వ్చింవెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే జిల్లా నాయకులకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార ఇన్చార్జులు గ బాధ్యతను ఆయా పార్టీలు అప్ప గించాయి. దీంతో వారంతా అక్కడికి చేరుకొని వారికి అప్పగించిన ప్రాంతంలో ప్రచారంలో బిజీ అయ్యారు. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు తరలి రావాలని పార్టీ శ్రేణులకు అన్ని పార్టీ అధినాయకత్వం పిలుపునివ్వడంతో ద్వితీయశ్రేణి నాయకులంతా ఒక్కొక్కరుగా హైదరాబాద్కు తరలివెళ్లారు. దీంతో అన్ని జిల్లాల్లో రాజకీయ కార్యక్రమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గ్రామాల్లోనూ సందడి తగ్గింది. మంత్రులు , నేతలు అంతా హైదరాబాద్లోనే మకాం వేశారు. నిత్యం ప్రజలతో మమేకమై ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనే సర్పంచులు , ఎంపీటీసీలు , జడ్పీటీసీలు , ఎంపీపీలు , మున్సిపాలిటీల్లో చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లంతా కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి తరలి వెళ్లారు.

దీంతో గ్రామపంచాయతీ కార్యాలయాలు, మున్సి పాలిటీలు, మండల కార్యాలయాలు, కార్పొరేషన్లో రాజకీయ నాయకులు సందడి పూర్తిగా తగ్గిపోయింది. వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు కూడా ఆయా కార్యాలయాలకు రాకపోవడంతో రద్దీ తగ్గింది. హైదరాబాద్ ఎన్నికలను అధికార పార్టీ ఎంతగా ప్రతిష్టాత్మకంగా తీసుకుందో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక్కో నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీకి చెందిన 200 నుంచి 300 మంది ప్రజాప్రతినిధులు , నాయకులు , కార్యకర్తలు హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి తరలివెళ్లారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, వామపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గ్రేటర్ ఎన్నిక ప్రచారంలోనే ఉన్నారు. హైదరాబాద్లో ఎన్నిక ప్రచారంతో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంటే జిల్లాల్లో రాజకీయ సందడి రోజురోజుకు తగ్గిపోతోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న జిల్లా నేతలంతా సోషల్ విూడియాలో పోస్టింగు పెడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

మరోవైపు టిక్కెట్లు రానివారు ఎటువైపు అన్న ప్రశ్న ఉదయిస్తోంది. అధికార టిఆర్ఎస్, బిజెపికు ఈ బెడద తీవ్రంగానే ఉంది. కార్పొరేటర్ టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థులంతా తిరుగుబాటు ఎగురేశారు. దీంతో పలు చోట్ల బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు కొత్త చిక్కు వచ్చిపడ్డాయి. టీఆర్ఎస్ ప్రకటించిన 150 మంది జాబితాలో సుమారు 26 ప్రాంతాల్లో తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిత్వాలు ఆశిస్తూ పలు డివిజన్లలో కుప్పులు తెప్పులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థులను కాదని కొత్తవారికి టికెట్లు ఇచ్చిన డివిజన్లలో భారీగానే తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలోగా తిరుగుబాటు అభ్యర్థులు ఉపసంహరణ, బీ ఫారం సమర్పించేందుకు అవకాశం ఉండటంతో టీఆర్ఎస్, బీజేపీ బృందాలు బుజ్జగింపు మొదుపెట్టాయి. మొత్తంగా గ్రేటర్ ఎన్నికలు మినీ అసెంబ్లీని తలపిస్తున్నాయి. ప్రచారంలో దూసుకుపోతున్న తీరు చూస్తుంటే ఈ రెండు పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓటు వేసే వారు ఏ మేరకు స్పందిస్తారు…ఏ మేరకు తమ ఓటు వినియోగించుకుంటారన్నది కూడా ముఖ్యమే.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *