వైద్య రంగానికే సవాల్‌గా ఏలూరు వింతవ్యాధి..!

ఆంధ్రప్రదేశ్ : పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలురులో విస్తరిస్తున్న వింతరోగంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు పులివిూద పుట్రలా దాపురించింది. వ్యాధి కొత్తది కావడంతో సర్వత్రా ఆందోళన నెల కొంది. ఇది కేవలం ఏలురుకే పరిమితం అనుకోవడానికి లేదు. వ్యాధి విస్తరిస్తున్న తీరు చూస్తుంటే ఇది కూడా ఓ అంటువ్యాధిలా ప్రబలే ప్రమాదం ఉందన్న భయాలు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ ఎయిమ్స్‌,ఐఐసిటి తదితర వైద్య బృందాలు పరిశోధనలు చేపట్టాయి. అసలు వ్యాధికి గల కారణాలు తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు. రోజులు గడుస్తున్నా వ్యాధి తగ్గకపోగా రోగుల సంఖ్య పెరుగుతోంది. వ్యాధి ల
క్షణాలు కనిపిస్తున్నాయి కానీ.. వ్యాధి సోకడానికి కారణాలు తెలియడం లేదు. ఢల్లీి నుంచి ఎయిమ్స్‌ డాక్టర్లు, హైదరాబాద్‌ నుంచి నిపుణులు వచ్చి పరీక్షలు చేస్తున్నారు. ఫలితాల కోసం చూస్తున్నారు. కొంతమంది నిఫా వైరస్‌ అంటున్నారు. దీంతో ఇప్పుడు ఏలురుకు రావాలంటేనే చాలామంది వణుకుతున్నారు. కొందరు ఇక్కడ ఉన్నవారు ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నారు.

ఏలురుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్ని వణికిస్తున్న వ్యాధి నిజంగా వైరస్సేనా? అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. క్రమేపీ ఈ మహమ్మారి నగరమంతా విస్తరించడం చూస్తుంటే మరింత ఆందోళన కలుగుతోంది. అయితే అంతు చిక్కని వ్యాధి విజృంభిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వాసుపత్రి కిటకిట లాడుతోంది. అనేక మంది బాధితులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరినవాళ్లు ఇప్పటి వరకు 200 నుంచి 300 మంది వరకు ఉండొచ్చని అంచనా. ప్రజల్లో భయాందోళనలు పెరగడంతో నగరంలోని 62 వార్డు సచివాలయాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని డీఎంహెచ్‌వో సునంద తెలిపారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం నలుగైదుగురు మాత్రమే చనిపోయారి అంటున్న మృతుల సంఖ్య ఎక్కువేనని అంటున్నారు. పాలు , నీళ్లలో వ్యాధికి సంబంధించిన ఆనవాల్లు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. వైద్యం చేస్తున్న డాక్టర్లకు కూడా ఇది అంతు చిక్కడం లేదు. దీంతో నిపుణులైన వైద్య బృందాలకూ ఇది సవాల్‌గా మారింది..

కారణాలు తెలుసుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఢల్లీి ఎయిమ్స్‌ నుంచి వచ్చిన డాక్టర్లు ఏలురు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. స్థానిక డాక్టర్ల నుంచి సమాచారం తీసుకున్నారు. ఫీల్డ్‌ లెవల్లో వేరే బృందాలు పర్యటి స్తున్నాయి. ఇప్పటికే 40 మంది వ్యాధిగ్రస్తుల నుంచి శాంపిల్స్‌ తీసుకున్నారు. మరికొంత మంది రోగుల నుంచి నమూనాలు సేకరించాని ఎయిమ్స్‌ డాక్టర్లు సూచించారు. తొలి దశ నమూనా పరీక్షల్లో బాధితుల శరీరంలో సీసం, నికెల్‌ లోహాలున్నట్టు ప్రాధమిక నిర్దారణ అయినట్లు సమాచారం. గోదావరి, కృష్ణా కాలువ లోని రసాయనాల వల్లే లెడ్‌, నికెల్‌ వంటి భారలోహాలు ఏలురు నగర వాసుల శరీరంలోకి ప్రవేశించాయా లేక మరింకేమైనా ఆహార పదార్థాల రూపంలో వెళ్లాయా అనే దానిపై వివిధ బృందాలు సేకరించి రూపొందించిన నివేదిక ఒకటి,రెండు రోజుల్లో వేలువడనున్నాయి. వింత వ్యాధికి గల కారణాలు అప్పుడే వేలుగు చూడనున్నాయి. అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రి పాలై కోలుకున్నారని ఇంటికి పంపిన బాధితుల ను ఇంకా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఫిట్స్‌ తగ్గినా పూర్తిస్థాయిలో కోలుకోవడంలేదు. షుగరు, వెన్నునొప్పి, తలనొప్పి, నీరసం, భయం, కాళ్లూ, చేతులు గుంజుకుపోవడం, నరాల బలహీనత వంటి పలు రకాల సమస్యల తో బాధ పడుతున్నారు.

కొందరైతే ఇంకా లేచి కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు. పూర్తిస్థాయిలో కోలుకోకుండానే తమను ఇంటికి పంపేశారని వాపోతున్నారు. వ్యాధి తీవ్రత కారణంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లోను 108 అంబులెన్సుతో సిబ్బంది అప్రమత్తంగా ఉంచారు. ఏలురు ప్రభుత్వాసుపత్రి వద్ద అత్యవసర విభాగంలోనే అన్నిరకాల వైద్య నిపుణుల , సిబ్బంది వైద్య సేవలను అందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ ప్రాణాపాయ పరిస్థితిలో లేరని అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. ఏలురు వింతవ్యాధి వైద్యరంగానికి సవాల్‌ విసిరిన నేపథ్యంలో కేంద్ర వైద్య బృందం రంగంలోకి దిగింది. నగరంలోని పలు ప్రాంతాల కు వెళ్లి పరిశీలించారు. ఏలురు ప్రభుత్వాసుపత్రికి వచ్చి వైద్యుల బృందంతో చర్చించారు. వార్డుల్లో వున్న బాధితుల ఆరోగ్య పరిస్థితుల ను అడిగి తెలుసుకుని స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కొంత మంది నుంచి రక్త నమూనాల ను సేకరించారు. కేంద్ర బృందంతో పాటు మంగళగిరి ఎయిమ్స్‌ బృందం ఆసుపత్రిలో బాధితుల ను ప్రతిక్షణం పరిశీలిస్తూ వారి ఆరోగ్య పరిస్థితుల పై ఆరా తీస్తున్నారు.

ఒకవైపు వ్యాధికి సంబంధించిన లక్షణాలను ఆరా తీస్తూనే అనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఫిట్స్‌తో పడిపోయిన వారు వైద్యసేవాలు అందాక త్వరగా కోలుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. అత్యవసర సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. నగరంలో రాబోయే నాలుగు రోజులుప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో 24 గంటల పాటు వైద్యసేవాలు అందించేలా.. ఒక్కో వార్డుకు ఒక్కో వైద్యుడికి విధులు కేటాయించారు. ఇప్పుడు ఉన్నవాటికి తోడు అదనంగా పది అంబులెన్స్‌లు రప్పిస్తున్నారు. అంతుచిక్కని వ్యాధికి గల కారణాలు గుర్తించేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నామని ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని అన్నారు. నీటి నమూనాలు సేకరించామని, పాల నమూనాను కూడా తీసుకుంటామన్నారు. విజయవాడ నుంచి నమూనా ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఏలురులో ప్రజల అస్వస్థతకు దారి తీసిన కారణాలను పూర్తి స్థాయిలో పరిశోధించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *