కెప్టెన్సీలో ధోనీని మించిపోయాడా...?

సిడ్నీ : మూడు మ్యాచ్‌ ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో కోహ్లీసేన మరో టీ20 మ్యాచ్‌ మిగిలి ఉండగానే.. సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది. దీంతో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ ఓ అరుదైన ఘనత అందుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్‌ని గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీకి సైతం సాధ్యం కాని రికార్డును కోహ్లీ సాధించి వారెవ్వా అన్పించాడు. మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ నుంచి 2017లో విరాట్‌ కోహ్లీ టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అప్పటినుంచి ముఖ్యంగా టీ20ల్లో భారత్‌కి వరుస విజయాల్ని అందిస్తున్నాడు. 2018లో కోహ్లీ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్‌ గెలిచిన భారత్‌.. అదే ఏడాది ఇంగ్లండ్‌లోనూ టీ20 సిరీస్‌ గెలుచుకుంది.

ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌ గడ్డపై టీ20 సిరీస్‌ గెలిచిన కోహ్లీసేన.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపైనా సిరీస్‌ కైవసం చేసుకుంది. 2007 నుంచి 2017 వరకూ కెప్టెన్‌గా ఉన్న ధోనీ ఈ రికార్డ్‌ అందుకోకపోవడం విశేషం. విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కంగారూ గడ్డపై టెస్ట్‌, వన్డే, టీ20 సిరీస్‌ను గెలిచిన ఏకైక సారథిగా నిలిచాడు. కోహ్లీ సారథ్యంలో ఆసీస్‌ గడ్డపై 2018-19లో టెస్ట్‌, వన్డే సిరీస్‌ గెలిచింది. తాజాగా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే.. టీమిండియా 2-0తో టీ20 సిరీస్‌ గెలుచుకుంది. దీంతో కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. కోహ్లీ నాయకత్వం లో చివరిగా ఆడిన 10 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియాకి అసలు ఓటమే లేదు. అంతేకాదు టీ20ల్లో 190పైచిలుకు లక్ష్యాన్ని ఇప్పటికే ఏడు సార్లు భారత్‌ విజయవంతంగా ఛేజ్‌ చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 మ్యాచ్‌ పరంగా చూస్తే అత్యధిక పరుగుల ఛేజింగ్‌లో టీమిండియానే టాప్‌-2 స్థానాలను ఆక్రమించింది.

2016లో ఆసీస్‌తో జరిగిన టీ20లో టీమిండియా 198 పరుగుల టార్గెట్‌ ను ఛేజ్‌ చేసింది. మళ్లీ ఇప్పుడు 195 పరుగులు టార్గెట్‌ను ఆస్ట్రేలియాపై వారి దేశంలోనే ఛేజ్‌ చేసింది. ఫలితంగా ఆసీస్‌పై ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు ఛేజింగ్‌ రికార్డుల్లో తొలి రెండు స్థానాల్లో టీమిండియా నిలిచింది. అయితే ఈ రెండు మ్యాచ్‌లు సిడ్నీలో జరగడం మరొక విశేషం. టీమిండియా తర్వాత స్థానంలో శ్రీలంక ఉంది. 2017లో 174 పరుగు టార్గెట్‌ను ఆసీస్‌పై వారి దేశంలో ఛేజ్‌ చేశారు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా విజయాలు సాధించిన జాబితాలో పాకిస్తాన్‌తో కలిసి టీమిండియా సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది భారత్‌ వరుసగా సాధించిన టీ20 విజయాలు 9. 2018లో పాకిస్తాన్‌ వరుసగా 9 విజయాలు అందుకుంది. తొలి స్థానంలో అఫ్గానిస్తాన్‌ ఉంది. అఫ్గానిస్తాన్‌ 2016-17 సీజన్‌లో వరుసగా 11 విజయాలు సాధించగా.. 2018-19 సీజన్‌లో 12 విజయాలు సాధించింది. తొలి రెండు స్థానాల్లో అఫ్గానిస్తానే ఉంది.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *