ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు వినూత్న ప‌ద్థ‌తిలో రెచ్చిపోతున్నారు. ఫేస్‌బుక్‌లో పోలీసులు, లాయర్లు, వైద్యుల పేర్లతో కొత్తగా పేజీలు సృష్టిస్తూ, అందులో ఉన్న వారికి ఫ్రెండ్స్‌ రిక్వెస్టులు పెట్టడం, వారు యాక్సెప్ట్‌ చేసిన తర్వాత వారికి మెసెంజర్‌ ద్వారా అత్యవసరమంటూ రెండు, మూడు వేల రూపాయల నుంచి ప‌దివేల వ‌ర‌కు స‌హ‌యం కావాల‌ని అడుగుతున్నారు. దీంతో చాలా మంది ఏదో అవసరం ఉండొచ్చ‌ని అనుకుని పేటీమ్, ఫోన్‌పే ద్వారా పంపించేస్తున్నారు. ఈ కోవలోనే చాలా మంది పోలీస్‌ అధికారులు కూడా బలయ్యారు. రూ. లక్షల్లో సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నారు. తాజాగా ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై హరి పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా ప్రారంభించారు. అతని మిత్రులందరినీ నకిలీ ఖాతాలో యాడ్‌ చేసుకుని వారితో మెసెంజర్‌ ద్వారా చాట్‌ చేశారు. అర్జెంట్‌ అవరం ఉందని గంటలో డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ స్నేహితులకు మెసేజ్‌లు పంపించడంతో చాలా మంది ఫోన్‌పే, పేటీఎంల ద్వారా పంపించారు. అయితే ఫోన్‌ పేలో పేరు సరిగా లేకపోవడంతో ఒకరికి అనుమానం వచ్చి ఎస్సై హరికే నేరుగా ఫోన్‌ చేయడంతో ఆయన అవాక్కయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమందించి, ఆ ఖాతాను బ్లాక్‌ చేయించారు. ఎవ్వరూ డబ్బులు వేయవద్దని వాట్సాప్‌ ద్వారా మిత్రులందరికీ మెసెజ్‌లు పెట్టారు. ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఎక్కువ‌గా ఫేక్ ఐడీలు సృష్టించి డ‌బ్బులు కాజేయడం అల‌వాటుగా మారిపోయింది. అందుకే కొత్త ప్రెండ్స్ రెక్విస్ట్‌లు వ‌చ్చినా, కొత్త మెసెజ్‌లు వ‌చ్చినా అచితూచి అడుగువేయాల్సిన ప‌రిస్థితి ఉంది.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *