వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమలలో ఆదివారం ఉదయం శ్రీవారి లక్ష్మీహారాన్ని ఆలయం నుండి వైభవోత్సవ మండపం వరకు ఊరేగించారు. అంతకు ముందు శ్రీవారి పాదాల చెంత లక్ష్మీహారాన్ని ఉంచి ప్రత్యేక పూజ చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహనం రోజున శ్రీవారి ఆభరణాలు ఖజానా నుంచి అత్యంత ప్రధానమైన లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆదివారం తిరుమల నుంచి అత్యంత భద్రత నడుమ వాహనంలో శ్రీవారి లక్ష్మీహారాన్ని తిరుచానూరుకు తరలించారు. సాయంత్రం గజవాహన సేవలో శ్రీవారి లక్ష్మీహారాన్ని అమ్మవారికి అలంకరిస్తారు. గజవాహనసేవకు ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తుమ్మగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి చెవిరెడ్డి దంపతులు పట్టువస్త్రాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.

ప్రతి ఏటా గజవాహన సేవ రోజు కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలను తీసుకెళ్లి సమర్పించడం ఆనవాయితీ.. ఈ సారి భారీ వర్షం కురిసినప్పటికీ ఆ ఆనవాయితీని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు కొనసాగించారు. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది, సోమవారాల్లో జరుగనున్న గజ, గరుడ వాహనసేవల్లో అంకరించేందుకు తిరుమల శ్రీవారి ల క్ష్మీకాసుల హారాన్ని ఆదివారం ఉదయం తిరుచానూరుకు తీసుకొచ్చారు. ముందుగా తిరుమలో శ్రీవారి ఆలయం నుండి ఈ హారాన్ని వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు. తిరుమలలో జరిగిన కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి వాహనంలో భద్రత నడుమ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. తిరుపతి జెఈవో పి.బసంత్‌ కుమార్‌కు అందజేశారు. అక్కడ హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవాయిద్యాల నడుమ ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా గర్భాలయంలోకి తీసుకెళ్లారు.

గోదాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం పల్లకి పై గోదాదేవి అలంకారంలో శ్రీ అలువేలుమంగ అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్ద వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. శనివారం రాత్రి హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్ద వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది . భూదేవి అంశం అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టుగా అలివేలుమంగ బ్రహ్మోత్సవాల్లో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, టిటిడి బోర్డు సభ్యులు , చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, జెఈఓ పి.బసంత్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ రమేష్‌ రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝన్సీరాణి , ఆగమ సహాదారులు శ్రీనివాసాచార్యులు , ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ కుమార్‌, ఏవిఎస్వో చిరంజీవి, విఐ సురేష్‌ రెడ్డి, మహేష్‌, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ రాజేష్ ‌ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *