Monday, January 17, 2022

భోగి రోజున విపక్షాల నిరసన మంటలు…

భోగి మంటల్లో ఏపీ జీవోలు వేసిన టీడీపీ
మంటల్లో పిఆర్‌సీని తగులబెట్టిన ఫ్యాప్టో నేతలు
పిడకలు వేసి నరసన తెలిపిన బిజెపి
అమరావతి,జనవరి14 : ఎపీలో భోగి పండుగ రోజు కూడా టీడీపీ నేతలు తమ నిరసనలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, ప్రజలకు నష్టకలిగించే జీవోలు ప్రవేశపెడుతోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ భోగి మంటలు వేసి ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. అయితే కృష్ణాజిల్లాలో గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు భోగి మంటలు వేశారు. అంతేకాకుండా ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. దీనితో పాటు విజయవాడలో టీడీపీ కార్యాలయం వద్ద వేసి భోగి మంటల కార్యక్రమంలో ఎమ్మెల్యే రావ్మెూహన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావ్మెూహన్‌ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు చెత్త పన్ను ప్లకార్డులను భోగి మంటల్లో వేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. ఫ్యాప్టో పిలుపు మేరకు అసంబద్ధ పీఆర్సీ రిపోర్టులను ఉపాధ్యాయులు భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. అసంబద్ధ పీఆర్సీ రద్దు చేయాలని ఫ్యాప్టో పూర్వపు ఛైర్మన్‌ పి.బాబురెడ్డి డిమాండ్‌ చేశారు. అలాగే సీపీఎస్‌ రద్దు చేయాలని, అశితోష్‌ మిశ్రా రిపోర్ట్‌ బహిర్గతం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ ప్రతిపాదన విరమించు కోవాలన్నారు. పాత హెచ్‌.ఆర్‌.ఏ రేట్లు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను మాస్టర్‌ స్కేల్‌ పరిధిలోకి తీసుకుని రావాలని బాబురెడ్డి అన్నారు. అమరావతి ఉద్యమ సెగలు పేరుతో మందడంలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో భోగి వేడుకులు జరుపుకున్నారు. భారీగా రాజధాని రైతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని, రాష్ట్రం భోగభాగ్యాలతో తుల తాగాలనే ఆకాంక్షను రైతులు వ్యక్తం చేస్తున్నారు.విజయవాడలోని రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ నేతలు భోగి మంటల వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పిడకలను భోగి మంటల్లో వేసి జగన్‌ సర్కార్‌ తీరుపై నిరసన తెలిపారు. బీజేపీ నేత షేక బాజీ మాట్లాడుతూ ఎపీలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. పంటలు ఇళ్లకు రాక.. రైతుల ఇళ్లల్లో నిస్తేజం ఏర్పడిందన్నారు. ప్రభుత్వం మద్యం, ఇసుక అమ్ముకుంటూ దోపిడీ చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, విద్యార్ధుల భవిష్యత్‌ను నాశనం చేసిందని మండిపడ్డారు. సినిమా టిక్కెట్ల అమ్మకంపై ఉన్న దృష్టి.. పేదల కష్టాలు తీర్చడంలో లేదన్నారు. సంక్రాంతి పండుగ సందడి లేక.. ఎంతోమంది పస్తులు ఉంటున్నారని, జగన్‌ పాలనలో అన్ని వర్గాల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతు న్నారని విమర్శించారు. సీఎం జగన్‌ వైఫల్యాలకు నిరసనగానే పిడకలను భోగి మంటల్లో వేశామని, ఇప్పటికైనా జగన్‌లో మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నామని షేక బాజీ అన్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles