ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. ముంబై బౌలర్ డానియల్ శామ్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా రాహుల్ తెవాటియా వికెట్ కూడా తీశాడు. దీంతో గుజరాత్ ఓటమి పాలైంది. ఈ సీజన్లో గుజరాత్‌కు ఇది మూడో ఓట . లక్ష్యఛేదనలో గుజరాత్ ఓపెనర్లు సాహా (55), గిల్ (52) హాఫ్ సెంచరీలతో రాణించినా మిడిల్ ఆర్డర్ తడబడింది. హార్డిక్ పాండ్యా (24), సాయి సుదర్శన్ (14) విఫలమయ్యారు. మిల్లర్ (19 నాటౌట్) వేగంగా ఆడలేకపోయాడు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు సాధించగా.. పొలార్డ్ ఓ వికెట్ తీశాడు. డానియల్ శామ్స్ 3 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కాగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ముంబై బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్‌ను వరించింది.