రామా కనవేమిరా 'రాజకీయాల కుటిలకోణాలు..!!'.

Submitted by Praneeth Kumar on Sun, 14/01/2024 - 12:11
Lord Rama see 'The Crooks of Politics..!!'.

రామా కనవేమిరా 'రాజకీయాల కుటిలకోణాలు..!!'.

ఖమ్మం, జనవరి 14, ప్రజాజ్యోతి.

జనవరి 22వ తేది దగ్గర పడుతున్న కొద్ది అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట హడావుడి తారస్థాయికి చేరుతుంది. రాజకీయ ప్రచారాలు, వివాదాలూ రామభక్తిని మించి పొంగిపొర్లుతున్నాయి. మొక్కుబడికోసం పిలుపులు అందించి వారు రావడం లేదు చూశారా..?? అంటూ దాడులు పెరుగుతున్నాయి. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో వారు మొదలు పెట్టిన ఈ ప్రహసనం ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు సోనియా రాహుల్‌ గాంధీల పై దాడితో మరింత తీవ్రస్థాయికి చేరింది. రాము అనిపించుకోవడానికే పిలిచి రామ వ్యతిరేకతతో రాలేదనే రాజకీయ దుష్ప్రచారం ఎత్తుకోడంలో ఎత్తుగడ ఎవరికి తెలియంది కాదు. అయోధ్య సమస్య పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నాటి నుంచి ఇప్పుడు ప్రాణప్రతిష్ట వరకూ మోది సర్కారు కనుసన్నల్లో అధికార కార్యక్రమంగానే అంతా జరుగుతోంది. ఇప్పుడు ఇతరులను భాగస్వాములను కాలేదని నిందించము వ్యూహాత్మకంగానే జరుగుతుంది. మతవిశ్వాసాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగడం లౌకిక రాజ్యాంగ విరుద్ధమనేది ప్రాథమిక సూత్రం. దాన్ని తోసిపుచ్చి మొత్తం మోడి భజనగా మార్చడం రెండు మాసాల్లో వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు. ఇక్కడ మాత్రం బిజెపి - సంఘ పరివార్‌లు దీనికి కర్త, కర్మ, క్రియ ప్రధాని మోది మాత్రమే అన్నట్టు నడిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు పోయిందంటే 1990లలో రథయాత్రతో అయోధ్యను దేశ రాజకియాలలో కేంద్రస్థానానికి తెచ్చిపెట్టిన అప్పటి బిజెపి అధినేత లాల్‌కృష్ణ అద్వానీని కూడా దూరం పెట్టేంతవరకూ. లోకాప వాదానికి వెరచి చివరకు రప్పిస్తున్నా రాముడే మోదిని ఎన్నుకున్నాడని ఆయనతో చెప్పిస్తున్నారు. వచ్చే వారం రోజుల్లోనూ ఈ వ్యూహాలు మరెన్ని వింతలకు దారితీస్తాయో చూడవలసిందే. పురాణాల్లో కృష్ణ లీలలుంటాయి గాని రామ లీలలుండవు. రామలీలా మైదాన్‌ లు కూడా తర్వాత వచ్చినవే. రాముడి పేరిట ఆరెస్సెస్‌ బిజెపి లీలలే ఇవన్నీ.
పాలక పార్టీల భిన్న వైఖరులు
వాస్తవానికి అయోధ్య రామమందిరం పేరిట దేశమంతటా సంగ్ పరివార్‌ శాఖలు, అనుబంధ సంస్థలు అక్షింతలు దేశమంతా పంచి పెడుతున్నాయి. బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహరావు విశాఖలో స్వయంగానే ఈ కార్యక్రమం నిర్వహించారు. అన్ని పార్టీల అధ్యక్షులను, కార్యదర్శులను లాంఛనంగా పిలిచినట్టు చేస్తున్నారు. వాటి వాటి కోణాలలో అవి స్పందిస్తున్నాయి. మతం రాజకీయం కలగాపులగం చేయకూడదనే రాజ్యాంగ సూత్రాలను కమ్యూనిస్టులు ఎప్పడూ పాటిస్తారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన, బిఆర్‌ఎస్‌, సమాజ్‌వాది పార్టీ, వైసిపి, ఆప్‌ వంటి వివిధ పాలక పార్టీల విషయం చూస్తే అనేక కోణాలు కనిపిస్తున్నాయి. మీడియాలోనూ విభిన్న వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. ఆయా పార్టీల పై వ్యక్తుల పై సంఘ పరివార్‌ ప్రతిస్పందనలోనూ తేడాలున్నాయి. ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ పైన, సైద్ధాంతిక ప్రత్యర్థులైన కమ్యూనిస్టుల పైన తీవ్రంగా దాడి జరుగుతుంది. ఇన్ని దశాబ్దాలలో లౌకిక సూత్రాల విషయంలో వూగిసలాటలకు గురై బిజెపి పెరుగుదలకు బాట వేసిన కాంగ్రెస్‌ నేతలు ఈ దశలోనూ వివిధ స్థాయిల్లో రక రకాలుగా స్పందిస్తూ కొంత గందరగోళం ప్రదర్శిస్తున్నారు. ఇది ఫక్తు బిజెపి కార్యక్రమంలా జరుగుతున్నందుకే వెళ్లడం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. వారు అధికారంలో వున్న కర్నాటకలో గాని, బిజెపికి కీలకమైన యూపి, గుజరాత్‌లలో గానీ కాంగ్రెస్‌ వేర్వేరు రూపాలలో వ్యవహరిస్తుంది. అసలు అయోధ్య స్థలం తాళాలు తీసిందే తాము గనక ఈ ఘనత తమదేనన్న ప్రచారం వాటిలో ఒకటి. మేమంతా హిందువులమే మీ అనుమతి ఏమిటన్న ప్రశ్న మరొకటి. మమతాబెనర్జీ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. అసలు అయోధ్యకు వెళ్లకపోవడం ద్వారా కాంగ్రెస్‌ పెద్ద తప్పు చేసిందని కొందరి మాట. ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకుని కొంత వాస్తవికత చూపిందని రాజ్‌దీప్‌ సర్దేశాయి వంటివారి వ్యాఖ్యానం. నెహ్రూ మత విషయాల్లో రాజ్యాంగ బద్దమైన దూరం పాటించినా 1980 తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ఆ మార్గం నుంచి వైదొలగడం వల్లనే బిజెపి రాజకీయ శక్తిగా ఎదగడం సాధ్యమైందనేది ఆయన విశ్లేషణ. వైసిపి వంటి పార్టీలు రాజకీయంగా ఏం మాట్లాడ లేదు గాని టిడిపి సంస్థ ద్వారా లడ్డూలు, ప్రసాదాలు పెద్ద ఎత్తున పంపించి ప్రచారం చేసు కుంటున్నాయి. పాలక పార్టీల నేతలు చాలామంది వ్యక్తిగత స్థాయిలోనూ, స్థానికంగానూ తాము ఇందులో పాలు పంచుకుంటున్న భావం కలిగేంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక బిఅరెస్ పార్టీ అయితే వారి పత్రికలో అయోధ్యలో కలలు నెరవేరుతున్నట్టుగా సంపాదక వ్యాసం ఇచ్చింది. కాంగ్రెస్‌ డిఎన్‌ఎ హిందూ వ్యతిరేకమని ఆ పార్టీ ఎంఎల్‌సి కవిత ట్వీట్‌ చేశారు. ఇప్పుడు దేశవ్యాపతంగా పరివార్‌ పాడుతున్న పాట ఇదే. తాము తప్ప అందరూ హిందూ వ్యతి రేకులేనన్నట్టు చిత్రించడం ఇక్కడ ఉద్దేశం. మల్లికార్జున ఖర్గే దీనికి సమాధానమిస్తూ భక్తిగల వారంతా రామ మందిర సందర్శనకు ఎప్పుడైనా వెళ్లవచ్చును. దీనికి బిజెపి అనుమతి అనవసరమని విమర్శించారు. మరోవంక సంగ్ పరివార్‌ ప్రతినిధులు. మదర్‌థెరెసా సాధుకరణ సందర్భంలో సోనియా గాంధీ పోప్‌కు రాసిన లేఖనూ, రాహుల్‌ గాంధీ బాబరు సమాధి సందర్శననూ ఈ సమయంలో పోటీ పెట్టి మాట్లాడుతున్నారు. అయితే నెహ్రూ గతంలో సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించారని, హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ను అక్కడకు వెళ్ల వద్దని సలహా ఇచ్చారని, ఆ సమయంలో బిజెపి సిద్ధాంత కర్తలు చరిత్ర తవ్వితీస్తున్నారు. అధికార హోదాలో నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ ఆ ఆలయం ప్రారంభించడం లౌకిక సూత్రాలతో సరిపడదని నెహ్రూ చెప్పిన మాట సరైందే. అయితే స్వతహాగా మితవాదులైన పటేల్‌, ప్రసాద్‌ ఆయన మాటలు ఆలించలేదు. ఇక్కడ రాజ్యాంగ స్పూర్తి ఏదన్న సంగతి వదలిబిపెట్టి నెహ్రూ పొరబాటు చేసినట్టు చెప్పడం గడుసుతనం మాత్రమే.

శంకర పీఠాధిపతులు దూరం.!!
ఇప్పటి వరకూ మనం రాజకీయ పార్టీల గురించి మాట్లాడం. కానీ మరో వైపున సనాతన హిందూ శిబిరంలో వారూ మోది హడావుడిని ఆక్షేపిస్తున్నారు. ఆ ధర్మానికి ప్రతీకలుగా పరిగణించబడే నాలుగు శంకర పీఠాల మహాచార్యులు బహిష్కరిస్తున్నారు. వారి కారణాలు సంప్రదాయపరమైనవి. ఆలయ నిర్మాణం పూర్తి కాలేదని, అసలు మసీదు శిథిలాల మీద ఆలయ నిర్మాణం శాస్త్ర విరుద్ధమని, పూజాది కాలు మోదియే నిర్వహించడానికి వీలులేదని తమతమ కోణాల్లో అభ్యంతరాలు ప్రకటించారు. తమాషా ఏమంటే ప్రతిపక్షాల పై ఇంతగా విరుచుకు పడిన బిజెపి, సంగ్ పరివార్‌ వారి వూసే ఎత్తడం లేదు. వారి అభ్యంతరాలు విననట్టే నటిస్తుంది. బిజెపి ఎంపీగా పని చేసిన సుబ్రహ్మణ్య స్వామి మరో విధమైన అభ్యంతరం లేవనెత్తారు. హిందూ సంప్రదాయంలో ఏదైనా భార్యా సమేతంగా చేయాలని, రాముడు అశ్వమేధ యాగం స్వర్ణసీతతో చేసిన గాథలు గుర్తు చేశారు. ఆమెను రావణుడు అపహరిస్తే రాముడు అన్వేషిస్తూ వెళ్లాడని, కానీ మోది వ్యవహారం అందుకు పూర్తి భిన్నంగా వుందని అపహాస్యం చేశారు. ఇవన్నీ ఆమోదించాలని కాదు గానీ, సంప్రదాయం, సనాతనం అనేవారు ఆ వర్గాల మాటలనూ బేఖాతరు చేయడం గమనించదగింది. మోది బృందానికి, సంగ్ పరివార్‌కు 2024 ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలు తప్ప మరేమీ కనిపించవు. నిజానికి అవి వారికి ముఖ్యం కాదు కూడా. కనుక ఇక్కడ సమస్య రాజకీయ మైంది తప్ప రాముడికి ఆయన భక్తులకూ సంబంధించింది కానే కాదు. ఇప్పుడు పరిష్కారం కూడా బిజెపి రాజకీయ ఉద్యమాలు, సుప్రీం కోర్టు తీర్పు ద్వారా సాధ్యం చేయబడింది. బాబ్రీ మసీదు డిసెంబర్‌ 6న కూల్చబడింది గనకే అక్కడ అవకాశమేర్పడింది. ఆ కూల్చివేత ఏ విధంగానూ సరైంది కాదని నేరపూరిత చర్య అని కోర్టు అభిశంసించింది. మసీదుకు మరోచోట స్థలం ఇవ్వాలని నిర్దేశించింది. అయితే అంతిమంగా తీర్పు మాత్రం ఏకపక్షంగా వుందనే విమర్శలు పున: సమీక్షించాలన్న అభ్యర్థనలూ కూడా చాలావున్నాయి. అసలు అయోధ్య వివాదం రాజేసిందే బ్రిటిష్‌ అధికారులు అన్న వాస్తవాలు చాలాసార్లు చెప్పుకున్నవే. అయోధ్య మందిరానికి మరో కోణం కూడా వుందని మాత్రం గుర్తుంచు కోవాలి.
మూడు పదుల ముప్పేట దాడి
1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. 2002లో గుజరాత్‌ మారణ కాండ సాగింది. 2012 -13లో మోది ప్రధాని అభ్యర్థిగా ముందు కొచ్చారు. 2020 ఆగష్టు 5న మోదియే భూమి పూజ చేశారు. ఈ జనవరి 24న ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ గత సెప్టెంబరులోనే ప్రకటించారు. ప్రధాని కార్యాలయంలో కీలక అధికారిగా పని చేసిన నృపేంద్ర మిశ్రా అయోధ్య ఆలయం కోసం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు చైర్మన్‌గా వున్నారు. దాదాపు రూ.18 వేల కోట్ల బడ్జెట్‌తో ఈ నిర్మాణం సాగుతున్నది. యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా మధ్య మధ్య కొన్ని క్రతువులు నిర్వహించారు. ఈ క్రమంలో అయోధ్యలో రియల్‌ మాఫియాలు, టూరిస్టు కేంద్రాలు విపరీతంగా పుట్టు కొచ్చాయి. ఈ ప్రారంభోత్సవ సమయంలోనైతే హోటల్‌ గది లక్ష రూపాయలు కూడా వున్నట్టు కథలు వస్తున్నాయి. మితవాద, మతవాద రాజకీయాలు ఉధృతమైన ఈ కాలానికి హిందూత్వ రాజధానిగా అయోధ్య వెలుగొందుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బుల్డోజర్‌ రాజ్‌ నడిపిస్తున్న యోగి యూపి ని పాలిస్తుండడం దీనికి అదనపు అంశంగా వుంది. గాంధీని హతమార్చి గాడ్సేను ఆరాధ్యుడుగా చూపే సంగ్ పరివార్‌ చరిత్ర కొత్త కాదు. ఆయన జీవితమంతా ‘రఘుపతి రాఘవ రాజారాం’ అని పాడేవారని బిజెపి అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఉవాచ. గాంధీజీ ‘ఈశ్వర్‌ అల్లా తేరేనామ్‌’ అని కూడా పాడిన గాంధీ తర్వాతి వాక్యాలను ఆయన కావాలనే వదిలేశారు. కానీ భిన్న మతాలు, సంప్రదాయాలను అనుసరించే వారందరూ భారతీయులేనన్న కనీస అవగాహన గల వారెవరైనా జాతిపిత జాడలనే అనుసరిస్తారు. రామ రథయాత్ర కాలంలో తన సహాయకుడుగా ఉన్న మోది అంత ప్రసిద్ధుడు కాకున్నా రాముడు ఆయన్నే తన ఆలయ నిర్మాణానికి ఎన్నుకున్నాడని అద్వానీ వ్యాసం రాస్తున్నారు. వాస్తవానికి అద్వానీని, మోదిని, రాముణ్ని కూడా ఎన్నుకున్నది సంగ్ పరివార్‌ మాత్రమే. అందుకే 'రాజ్యాంగ బద్ద ప్రజాస్వామ్య భారత పరిణామ క్రమంలో అయోధ్య రామ మందిర ఘట్టాన్ని చాలా నిశితంగా విమర్శనాత్మకంగా పరిశీలించవలసి వుంటుంది'. లౌకిక భావాలు గల వారెవరైనా దీన్ని యథాలాపంగా భావిస్తే పొరబాటవుతుంది. హిందూ మతం వేరు, హిందూత్వ రాజకీయం వేరు, ఆ రాజకీయం రాజ్యం చేయడం వేరనే స్పష్టత కోల్పోకూడదు. నడుస్తున్నది మోది రాజ్యమే గాని, రామరాజ్యం కాదని తెలియజెప్పక తప్పదు అన్నది మా వాదన.