లేఖ రేపిన కాక - మౌనం వీడిన మండవ : బరిలోకీ ఎక్కడి నుంచి ఏలా.?

Submitted by SANJEEVAIAH on Mon, 03/10/2022 - 13:02
మండవ వెంకటేశ్వరరావు

లేఖ రేపిన కాక - మౌనం వీడిన మండవ

మాజీ మంత్రి మండవ అడుగులెటో 

ఏకంగా ఏపి సీఎం జగన్ కు లేఖ

ధర్మారంలో ఎన్టీఆర్ జయంతికి హాజరు

అనుచరులతో మాటామంతీ

పోటీలో ఉండాలని డిమాండ్  

క్లీన్ ఇమేజ్ పై భరోసా

వెన్నంటి ఉంటామని హామీ

పార్టీలకతీతంగా మద్దతు

"వెంకటేశ్వర" నిర్ణయంపై ఆసక్తి

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ

( నిజామాబాద్ ప్రతినిధి - ఎడ్ల సంజీవయ్య)

సార్ మీరు రావాలి..  మీలాంటి నాయకత్వం అవసరం.. మచ్చలేని వ్యక్తిత్వం మీ స్వంతం... మీరులేని లోటు  కనిపిస్తుంది... పార్టీలకతీతంగా మీ వెన్నంటి ఉంటాం... కలిసి పని చేస్తాం... ఐదు పర్యాయాల ఎమ్మేల్యేగా మీరేంటో మాకు తెలుసు.. పార్టీ ఏదైనా బరిలో ఉంటే తప్పక గెలుస్తారు... మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రండి అంటూ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ముఖ్య అనుచరులు ఆయనను కోరడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జోరైనా రాజకీయ చర్చకు తెరలేపింది. మాటల దూషణల రాజకీయ  పర్వంలో ఆయన అడుగులేటోననే దానిపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సహజంగా మృదుస్వభావైన మండవ ఎలా స్పందిస్తారోననే ఆతృత స్థానికంగా కనిపిస్తోంది. తాజాగా ఆయన అడుగులు మాత్రం అనుచరుల కోరిక నెరవేర్చేలా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. 

మంత్రిగా తనదైన ముద్ర:

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐదు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా చక్రం తిప్పిన మండవ వెంకటేశ్వర రావు ప్రస్తుతం చర్చకు కేంద్ర బిందువు అయ్యారు. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా,  నామమాత్రపు కార్యచరణలో ఉన్నారు. 2018 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మండవ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత కూడా మండవ వెంకటేశ్వరరావు పార్టీలో ఉన్నారా.? లేదా అన్నట్టుగానే మౌనంగానే ఉండిపోయారు. ఇటీవల కాలంలో ఆయన రాజకీయ  శంఖం పురిస్తారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకుంది.  అయినప్పటికీ మౌనం వీడలేదు.  ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును మార్చి వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చడంపై మండవ స్పందించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాలు, పార్టీల వ్యవహారాల తీరు, రాష్ట్ర ముఖ్యమంత్రిల పని తీరు ఏ విధంగా ఉండేదో చెప్తూనే మళ్లీ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరారు. దీంతో రెండు రాష్ట్రాల్లో మండవ వెంకటేశ్వరరావు పేరు రాజకీయంగా చర్చకు దారి తీసింది. అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలోనూ వైఎస్ఆర్సిపి, టిఆర్ఎస్ నేతలు మండవ పేరును ప్రస్తావించారు. ఇలా మరోసారి మీడియాలో మండవ పేరు రాజకీయ అంశాల్లో కీలకంగా నానడం చర్చకు దారి తీసింది.  దానికి తోడు ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై విమర్శలు స్పందించారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై ప్రస్తావిస్తూ ఖరీఫ్ పంట చేతుకొస్తుందని,  వెంటనే అందుకు సంబంధించిన చర్యలు చేపడుతూనే రబీ పంట కోసం చర్యలు తీసుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ప్రభుత్వాలకు సూచించారు. ఏ పార్టీలో ఉన్న ఎక్కడ ఉన్నవా మండవ వెంకటేశ్వరరావు మరో పార్టీలను విమర్శించడం అనేది దాఖలాల కనిపించవు. అలాంటి వ్యక్తి సడన్గా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడంతో మండల వెంకటేశ్వరరావు మౌనం వీడినట్లు అయింది.

ఆయన అడుగులు ఎటువైపు

గత ఐదు మాసాల కాలం నుంచి ఈసారి వచ్చే ఎన్నికల్లో మండవ  వెంకటేశ్వరరావు పోటీ చేస్తారని ప్రచారం ఊపు అందుకుంది. కానీ ఏ పార్టీ నుంచి చేస్తారు, ఎక్కడి నుంచి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అందులో భాగంగానే రకరకాల ప్రచారం కొనసాగుతున్నప్పటికీ దీనిపై క్లారిటీ లేకుండా ఉంది. ఈ తరుణంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మండవ ఐదుసార్లు పోటీ చేశారు. ఇప్పుడు కూడా అక్కడి నుంచే బిజెపి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. లేదా  కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని ఆయన అనుచరులు ప్రస్తావించడం విశేషం. ఇదిలా ఉంటే బోధన్ నుంచి పోటీ చేస్తారని మరో ప్రచారం ఊపందుకుంది. సెటిలర్ల ఓట్లు అత్యధికంగా ఉన్న బోధన్ నుంచి మండవ వెంకటేశ్వరరావు కు కలిసి వస్తుందని ప్రచారం జరుగుతుంది.  అయితే ఇంతకు మండవ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.? ఎక్కడ నుంచి పోటీ చేస్తారని మీమాంస కొనసాగుతుంది. అయినప్పటికీ ఆయన అడుగులు ఎటువైపు పడతాయో వేచి చూడాల్సిందే మరి.

 తెలంగాణ బరిలోకి టిడిపి...

ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ అభ్యర్థులు రంగంలో ఉంటారని ప్రచారం ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ టిడిపి కీలక సమావేశంలో కనీసం 40 స్థానాల నుంచి పోటీ చేయాలనే చర్చించారు. టిడిపి సింగిల్ గానే
పోటీ చేస్తే ఎలా ఉంటుంది లేదా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని అంశాలపై చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఒకవేళ టీడీపీ పోటీ చేయాల్సి వస్తే రాష్ట్రంలో కీలక బాధ్యతలు మండవ వెంకటేశ్వరరావు చేతుల్లోనే ఉంటాయని ఖచ్చితంగా నిజామాబాద్ రూరల్ నుంచి ఆయన పోటీ చేస్తారని పార్టీ నేతలు చర్చించడం చర్చిస్తున్నారు. అవును మరి... రాజకీయాలు అంటే మజాకా మరి... బళ్ళు ఓడలవుతాయి ఓడలు బల్లవుతాయి. రాజకీయాలంటే "శాశ్వత మిత్రులుండరు, శాశ్వత శత్రువులు ఉండరు" అనేది వాస్తవమే కదా. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్రం దిప్పిన మండల వెంకటేశ్వరరావు రాజకీయాలలో మరోసారి అడుగులు ఎటువైపు పడతాయో వేచి చూడాలి మరి.