కరీంనగర్ బ్యూరో,మే13 (ప్రజాజ్యోతి) జిల్లా కలెక్టర్, కరీంనగర్ ఆర్.వి. కర్ణన్ గారి అధ్యక్షతన వైద్యాధికారులు, శిశు సంక్షేమ అధికారులతో కలెక్టర్ గారి సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించబడినది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు మరియు ఎఎన్ ఎం లు సమన్వయముతో పని చేయాలని, 100% గర్భిణీలను మొదటి త్రైమాసికములో నమోదు చేసి అన్ని సేవలను అందించి, ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరుగునట్లుగా కృషి చేయాలని సూచించారు. ప్రతి సోమవారము మరియు శుక్ర వారము రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పోషకాహారాలతో కూడిన ఒక భోజనము అందించాలని అన్నారు. సి – సెక్షన్ ద్వారా కలిగే అనర్థాలను ప్రతి గర్భిణీ స్త్రీకి వివరించాలని అన్నారు. ప్రతి ఆరోగ్య ఉప కేంద్రాలలో (5) నెలలు నిండిన గర్భవతులకు శ్రీమంతం నిర్వహించి, పోషకాహారము ప్రాముఖ్యతను వివరించాలని అన్నారు. ముఖ్యముగా అంతర కుటుంబ నియంత్రణ పద్ధతిని పాటించేలా చూడాలని. మొదటి కాన్పు అయిన వెంటనే (3) సంవత్సరాల వ్యవధి ఉండేలా చూడాలని అన్నారు. ఈనెల డెంగ్యూ వ్యాధి నియంత్రణలో భాగముగా తేది: 16.05.2022 రోజున ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పరిధిలో డెంగ్యూ ర్యాలీ నిర్వహించి, మండల స్థాయిలోని అధికారులందరూ పాల్గొనాలని అన్నారు. ఈ సమావేశములో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, కరీంనగర్, డా. జువేరియా, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్, డా. రత్నమాల, డి డబ్య్లూఓ కరీంనగర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, సూపర్వైజరీ సిబ్బంది పాల్గొన్నారు