దుబ్బాక విడిసి రికార్డులు మాయం... కొనసాగుతున్న బహిష్కరణ... రెచ్చగొట్టి... తప్పించుకొని... *కస్టడీలో అసలు నిజం వెలుగు చూసేనా...?

Submitted by SANJEEVAIAH on Thu, 28/12/2023 - 14:11
Photo

దుబ్బాక విడిసి రికార్డులు మాయం... 

కొనసాగుతున్న బహిష్కరణ...

రెచ్చగొట్టి... తప్పించుకొని...

*కస్టడీలో అసలు నిజం వెలుగు చూసేనా...?

నిజామాబాద్ (ప్రజాజ్యోతి - ప్రతినిధి):

 ధర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామాభివృద్ధి కమిటీ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పద్మశాలి కులస్తులపై  అనధికారికంగా వీడీసీ సాంఘిక బహిష్కరణ వేటు వేయగా, ధర్పల్లి పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలు తెలుసు కోవాల్సి ఉందని, నిందితులను మూడు రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు. వాద, ప్రతి వాదనలు విన్న న్యాయమూర్తి ఒకరోజు కస్టడీకి అనుమతించారు. ఈ మేరకు  ధర్పల్లి పోలీసులు ఆ ఐదుగురిని జైలు నుంచి స్టేషన్ కు తీసుకువచ్చి లోతైన విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన వీడీసీ పెద్దలు అలర్ట్ అయ్యారు. గతంలో చేసిన అనేక తీర్మానాలు, వివిధ వ్యాపారాలకు సంబంధించిన టెండర్ల రికార్డులను మాయం చేశారు. ఈ రికార్డులను బెల్ట్ షాప్ నిర్వాహకుని ఇంట్లో రహస్యంగా భద్రపరిచినట్లు తెలిసింది. జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీలపై కేసులు నమోదు అవ్వడం సర్వ సాధారణమే అయినా, ఈ కేసులో తొలిసారి నిందితులను కస్టడీలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తీర్మానంతో దొరికిపోయారు...

గత ప్రభుత్వాలు సర్వేనెంబర్: 979 లో గల భూమిని పేద ప్రజలకు పంపిణీ చేయగా, ఆ భూమిని సాగు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ భూమి గొర్రెలు,మేకలు, బర్రెలకు పశుగ్రాసం కోసం స్వాధీనం చేసుకోవాలని వీడిసి తీర్మానం చేయడం సంచలనం సృష్టించింది. ఈ కేసును సీరియస్ గా పరిగణించిన సిపి కల్మేశ్వర్, గ్రామంలో అనధికారికంగా సమాంతర రాజకీయం చేస్తున్న వారిపై కొరడా జులిపించాలని ధర్పల్లి సిఐ సైదా ను ఆదేశించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సిఐ,  వీడిసి చేసిన తీర్మాన ప్రతి ఆధారంగా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

కనిపించని మార్పు...

 సాంఘిక బహిష్కరణ చేయడం చట్ట వ్యతిరేకమని, అలాంటి చర్యలకు పాల్పడవద్దని పోలీసులు గ్రామంలో ఆటో కు మైక్ ఏర్పాటు చేయించి ప్రచారం చేశారు.అంతేగాక మిగిలిన వీడీసీ సభ్యులతో సంప్రదింపులు జరిపి బహిష్కరణ ఎత్తివేయాలని సూచించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆ గ్రామంలో మార్పు కనిపించడం లేదు. నేటికీ పద్మశాలి కులస్తులు నిర్వహిస్తున్న కిరాణా షాప్ లు, బట్టల దుకాణాలు, హోటల్స్ లోకి ఇతర కులస్తులు వెళ్లడం లేదు. పోలీసుల ఎదుట బహిష్కరణ విధించలేదని చెబుతూనే, చాటుగా తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. 

కేసు నుంచి తప్పించుకొని...

ఈ వ్యవహారంతో హస్తం ఉన్న మరికొందరు  ఈ సమస్యను మరింత జటిలం చేసి కేసు నుంచి సునాయాసంగా తప్పించుకున్నారు. జనరల్ బాడీ సమావేశంలో అన్ని కులాల వారు మాట్లాడే అవకాశం ఉండగా, అక్కం గంగాధర్, బొల్లారపు గుల్కల్ గంగన్న, కావటి గంగాధర్, కూర దశరథ్, ఉప సర్పంచ్ ప్రతాప్, మరో వార్డు సభ్యుడు విజేందర్ రెడ్డి అనే వ్యక్తులు తొలుత తాళ్లచెరువు భూమి విషయాన్ని లేవనెత్తి వీడీసీ సభ్యులపై ఒత్తిడి పెంచారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని, పట్టా రద్దుకు నిరాకరిస్తే  బహిష్కరణ వేటు వేయాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. రెచ్చగొట్టిన వారంతా గ్రామంలో ఉండగా, వారి ఒత్తిడి మేరకు తీర్మానం చేసిన ఐదుగురు వీడీసీ సభ్యులు జైలు పాలయ్యారు.  అయినప్పటికీ కేసు నుండి తప్పించుకున్న వారి స్వరంలో మార్పు రావడం లేదు.వీడీసీ సభ్యులు జైలు నుంచి వచ్చాక మరోసారి సమావేశమై, పద్మశాలి కులస్తుల నుంచి కేసుకు అయ్యే ఖర్చులను వసూలు చేయాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా పద్మశాలి కులస్తులపై విధించిన బహిష్కరణ నిర్ణయాన్ని రహస్యంగా కొనసాగిస్తున్నారు.
గ్రామస్థులను రెచ్చగొడుతున్న వారితోనే అసలు సమస్య వస్తున్నట్లు సమాచారం. గ్రామంలో జరుగుతున్న అసలు నిజాలు పోలీసు కస్టడీలో వెలుగు చూస్తాయో లేదో వేచి చూడాల్సిందే...