ఆవిశ్వాసం లేనట్లేనా...? డిసిసిబి అవిశ్వాసానికి అడ్డంకి... కోర్టు మెట్లు ఎక్కిన ఛైర్మన్‌... ఒకటి, రెండు రోజుల్లో స్టే... ఇంకా క్యాంపులోనే డైరెక్టర్లు... చక్రం తిప్పిన ‘‘హస్తం’’ ఎవరిది.?...

Submitted by SANJEEVAIAH on Tue, 19/03/2024 - 09:31
Photo

ఆవిశ్వాసం లేనట్లేనా...?
డిసిసిబి అవిశ్వాసానికి అడ్డంకి...
కోర్టు మెట్లు ఎక్కిన ఛైర్మన్‌
ఒకటి, రెండు రోజుల్లో స్టే
ఇంకా క్యాంపులోనే డైరెక్టర్లు
చక్రం తిప్పిన ‘‘హస్తం’’ ఎవరిది.?

(నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా బ్యూరో ` ప్రజాజ్యోతి ` ఎడ్ల సంజీవ్‌)

నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా డిసిసిబి ఛైర్మన్‌పై ఆవిశ్వాసం కలగానే మిగిలేలా ఉంది. జిల్లా కలెక్టర్‌ లేదా సంబంధిత శాఖ కమిషనర్‌ ఇవ్వాల్సిన ఆవిశ్వాస నోటీసులకు బదులు డిసిసిబిలోని ఒ సభ్యుడు అయిన డిసివో నోటీసు ఇవ్వడాన్ని ఛైర్మన్‌ సవాల్‌ చేస్తు కోర్టు మెట్లు ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఒకటి, రెండు రోజుల్లో కోర్టు స్టే ఇచ్చే అవకాశాలున్నాయి. కోర్టు స్టే విధిస్తే ఛైర్మన్‌ భాస్కర్‌ రెడ్డిపై ఆవిశ్వాసం లేనట్లేననే ప్రచారం ఊపందుకుంది. మరికొంత కాలం ఈ ఆవిశ్వాసం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. 

బిఅర్‌ఎస్‌ ప్రభుత్వం మారిన వెంటనే డిసిసిబి ఛైర్మన్‌ భాస్కర్‌రెడ్డిపై డైరెక్టర్లు తిరుగుబాటు చేసారు. సాదారణ ఎన్నికల కంటే ముందు నుంచే ఈ వివాదం రాజుకుంది. దీనికి డిసిసిబి వైస్‌ ఛైర్మన్‌ రమేష్‌రెడ్డి పావులు కదిపినట్లు కొందరు డైరెక్టర్లు బహిరంగగానే చెప్పుకున్నారు. అయితే అప్పటికే శాసన సభ స్పీకర్‌గా ఉన్న పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కలుగజేసుకోవడంతో వాయిదా పడిరదని చెపుతున్నారు. కానీ అనుహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఛైర్మన్‌పై వ్యతిరేకంగా ఉన్నవారు కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఆవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. అయితే ఈ నోటీసుపై డిసివో శ్రీనివాస్‌ స్పందించి ఆవిశ్వాస తీర్మాణం కోసం తేది నిర్ణయించి నోటీసులు జారీ చేసారు. దీంతో సంబరాలు చేసుకున్న  డిసిసిబి డైరెక్టర్లు క్యాంపునకు వెళ్లారు. ఈనెల 20న నిజామాబాద్‌కు తిరిగి వచ్చి 21న జరిగే ఆవిశ్వాస తీర్మాణ సమావేశానికి హాజరు కానున్నారు. ఏలాగైనా అవిశ్వాసం నెగ్గుతున్నామని, కొత్త ఛైర్మన్‌ ఎంపికకు సైతం కసరత్తు చేసుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే మరోవైపు ఆవిశ్వాస తీర్మాణం నోటీసులపై డిసిసిబి ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి హైకోర్టు మెట్లేక్కారు. దీంతో కోర్టు సైతం ఒకటి, రెండు రోజుల్లో స్టే విధించే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఆర్మూర్‌ మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌పై ఆవిశ్వాసం డ్రామా వ్యవహారంలా కొనసాగుతుందనే ప్రచారం కూడా ఊపందుకుంది. 

ఏం జరిగింది..?

నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా డిసిసిబి ఛైర్మన్‌ భాస్కర్‌ రెడ్డిపై ఆవిశ్వాసానికి నోటీసులు ఇవ్వగా జిల్లా కలెక్టర్‌ లేదా సంబంధిత శాఖ కమిషనర్‌ నోటీసులు ఇవ్వాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జిల్లా కో ఆపరేటివ్‌ అధికారి (డిసిపి) శ్రీనివాస్‌ నోటిసులు ఇచ్చారు. దీనిపైనే అధికారులు చర్యలు చేపట్టారు. డిసిసిబిలో సాదారణ అధికారిక సభ్యుడు అయిన డిసిఓకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని ఛైర్మన్‌ సవాల్‌ చేస్తున్నారు. అయితే ఈ తంతు అంతా కావాలనే ఉద్దేశ్య పూర్వకంగానే చేసారనే విమర్శలు సైతం ఉన్నాయి. దీనిపై కోర్టు ఏ విధమైన ఆదేశాలు ఇస్తుందోనని, తదుపరి చర్యలు ఏలా తీసుకోవాలనే ఆంశంపై అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. ఏలాగు ఈనెల 21న తేది ఇవ్వడంతో డైరెక్టర్లు సైతం 15 మందికి పైగా పది రోజుల క్రితమే క్యాంపునకు వెళ్లారు. మెజారిటీ డైరెక్టర్లు అవిశ్వాసానికి మద్దతుగా నిలవడంతో ఎట్టి పరిస్థితుల్లో ఆవిశ్వాసం నెగ్గుతుందనే నమ్మకంతో ఉన్నారు. కానీ అనుహ్యంగా ఛైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అయితే దీనిపై ఆవిశ్వాసానికి నోటీసులు ఇచ్చిన డైరెక్టర్లు ఏలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి వస్తుంది.    

చక్రం తిప్పిందేవరు.?

నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా డిసిసిబి ఛైర్మన్‌ పదవిపై ఆవిశ్వాసం తీర్మాణం పెడితే ఏ స్థాయి అధికారి నోటీసులు ఇవ్వాలనేది అధికారులకు తెలియదా.? లేక ఏదైనా దురుద్దేశ్యంతోనే కావాలనే డిసివోతో నోటీసులు ఇప్పించారా అనేది అంతు చిక్కడం లేదు. అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఆవిశ్వాసం పెడితే ఏలాంటి ఇబ్బంది ఉండదని భావించిన డైరెక్టర్లు అదే ఏర్పాటు చేసుకున్నారు. కానీ జిల్లా కలెక్టర్‌ స్థాయిలో లేదా కమిషనర్‌ స్థాయిలో ఇవ్వాల్సిన నోటీసులలో ఏందుకు మార్పు జరిగిందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందే ‘‘ప్రజాజ్యోతి’’ దిన పత్రిక చెప్పినట్లు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ‘‘హస్తం’’ ఉండటంతోనే ఈ అడ్డదారిలో వ్యవహారం నడిపారనే ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా డిసిసిబి ఛైర్మన్‌పై ఆవిశ్వాసం లేనట్లేనని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కోర్టు ఆదేశాలు వెలువడితే కానీ అసలు సంగతి బయట పడేలా కనిపించడం లేదు సుమా.