హైదరాబాద్ – తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి.. మరీ ముఖ్యంగా ప్రజలతో నిత్యం మమేకమయ్యే రాజకీయ నాయకులు ఈ మూడో వేవ్ లో కరోనా భారీన పడుతున్నారు.. తాజాగా స్పీకర్ పోచారం, సిఎల్పీ నేత భట్టి , ఎమ్మెల్యే ముత్తిరెడ్డి లకు కరోనా పాజిటివ్ నిర్ధారణైంది.. ప్రస్తుతం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా కరోనా పాటిజివ్‌గా నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఎటువంటి సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు, సన్నిహితంగా ఉన్న వారు కొవిడ్ టెస్టు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారు తగు జాగ్రత్తలతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా మొదటి వేవ్‌లో ముత్తిరెడ్డి కరోనా బారినపడ్డారు.