ముంబై: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దాని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.. మదుపుదారులకు నేడు స్టాక్ మార్కెట్ బ్లాక్మండే గా మారింది.. బేర్ దెబ్బకు సోమవారం నాడు ఏకంగా రూ.6 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెక్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ రెండూ ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగాయి. మొదట్లో భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇంట్రా డేలో మరింత దిగజారాయి. ట్రేడింగ్ ముగింపు సమయానికి కొంతమేరకు తేరుకుని నష్టాల భారాన్ని తగ్గించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1200 పాయింట్లు (2.09 శాతం) నష్టపోయి 55,822 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 371 పాయింట్లు కోల్పోయి 16,614 వద్ద ముగిసింది. ఇందులో బీపీసీఎల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూసర్స్గా మిగిలాయి. టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి..