Tuesday, July 5, 2022

ఎపి లోని టిడిపి కార్యాలయాలపై దాడులు – రేపు బంద్ కి పిలుపు ఇచ్చిన చంద్ర బాబు.

అమరావతి: సీఎం జగన్‌ను తెదేపా నేతలు విమర్శించడాన్ని నిరసిస్తూ వైకాపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులకు తెగబడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈదాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన వాహనాలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో తెదేపా కార్యాలయంలో ఉన్న కెమెరా మెన్‌ బద్రీకి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

పట్టాభి నివాసంపై దాడి

విజయవాడలోని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై దాడి చేసిన వైకాపా శ్రేణులు ఇంటి ఆవరణలోని కారు, ద్విచక్రవాహనం, ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దాదాపు 200 మంది ఒక్కసారిగా ఇంటిపై దాడికి దిగారని పట్టాభి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. పట్టాభి దొరికితే చంపేస్తామంటూ పెద్దగా కేకలు వేస్తూ ఇంట్లోని ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం చేశారని తెలిపారు. వైకాపా మహిళా కార్యకర్తలు విశాఖలోని తెదేపా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వైకాపా శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపాకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు నినాదాలు చేశారు. తెదేపా నేత లింగారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వైకాపా శ్రేణులు యత్నించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంటలో తెదేపా నేతల ర్యాలీపై వైకాపా శ్రేణులు దాడికి దిగాయి. తెదేపా నేత బొజ్జల సుధీర్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నరసింహయాదవ్‌ ఆధ్వర్యంలో రేణిగుంట అంబేడ్కర్‌ విగ్రహం నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు ఆపార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని రేణిగుంట సర్పంచి నగేశ్‌, ఉప సర్పంచి సుజాత, వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. తెదేపా నేతలపై చెప్పులు, చీపుర్లతో వైకాపా నేతలు దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు

గుంటూరు లో టిడిపి ధర్నా

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆపార్టీ శ్రేణులు జాతీయరహదారిపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. తెదేపా కార్యాలయంపై దాడి విషయం తెలుసుకున్న తెదేపా శ్రేణులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు.

రేపు బంద్ కి పిలుపు ఇచ్చిన చంద్ర బాబు

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘దాడుల విషయంలో సీఎం, పోలీసులు లాలూచీ పడ్డారు. డీజీపీ కార్యాలయం పక్కనే  తెదేపా కార్యాలయం ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. ఇలాంటి వారు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏం కాపాడుతారు. పార్టీ కార్యాలయంపై దాడిని ఎప్పుడూ చూడలేదు. పార్టీ కార్యాలయం.. రాజకీయ పార్టీలకు దేవాలయం లాంటిది. డీజీపీ కార్యాలయం పక్కనే దాడి జరిగితే నిఘా విభాగం ఏం చేస్తోంది. ముఖ్యమంత్రి, డీజీపీ కలిసే ఈ దాడి చేయించారు. ప్రణాళిక ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడ్డారు. ప్రభుత్వ ప్రమేయంతోనే దాడులు జరిగాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ పాటించాలి. ఈ దాడులు.. స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం. రాష్ట్రంలో గంజాయి సాగు పెరుగుతోందని అందరూ చెప్పారు. అనేక రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. రాష్ట్రంలో 356 అధికరణం ఎందుకు ప్రయోగించకూడదు? కరెంటు ఛార్జీలను ఇష్టం వచ్చినట్టు పెంచుతారా? ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం చేద్దాం. ప్రజాస్వామ్యంపై దాడి చేసే శక్తులపై పోరాటం చేద్దాం’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

గవర్నర్‌కు చంద్రబాబు ఫోన్‌

గవర్నర్‌కు చంద్రబాబు ఫోన్‌ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూ షణ్ హరిచందన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దాడుల విషయాన్ని గవర్నర్‌కు వివరించారు. అనంతరం కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో పరిణామాలు వివరించారు. కేంద్ర బలగాల సాయం కోరారు. బలగాలు పంపేందుకు కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించినట్టు తెదేపా వర్గాలు వెల్లడించాయి

Related Articles

- Advertisement -spot_img

Latest Articles